పరిశోధనలకు పెద్దపీట వేయాలి: ప్రణబ్ | president pranab mukherjee stresses on basic research and innovation | Sakshi
Sakshi News home page

పరిశోధనలకు పెద్దపీట వేయాలి: ప్రణబ్

Published Wed, Apr 26 2017 1:11 PM | Last Updated on Wed, Aug 8 2018 6:12 PM

పరిశోధనలకు పెద్దపీట వేయాలి: ప్రణబ్ - Sakshi

పరిశోధనలకు పెద్దపీట వేయాలి: ప్రణబ్

నూరేళ్ల సంబరాలు చేసుకుంటున్న ప్రతిష్ఠాత్మకమైన ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటున్న విద్యార్థులు ప్రాథమిక పరిశోధనలకు పెద్దపీట వేయాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సూచించారు. ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన.. తీవ్రమైన గొంతునొప్పితో బాధపడుతూ, మధ్యమధ్యలో దగ్గుతూనే తన ప్రసంగాన్ని కొనసాగించారు. గతంలో తాను ఐఐటీ ఖరగ్‌పూర్ వెళ్లినప్పుడు అక్కడి డైరెక్టర్‌ను ఎంత మంది విద్యార్థులకు క్యాంపస్ నియామకాలు వస్తున్నాయని అడిగితే దాదాపు నూరుశాతం అని గర్వంగా చెప్పారని, అదే ఎంతమంది విద్యార్థులు మన దేశంలో పరిశోధనలు కొనసాగిస్తున్నారని అడిగితే మాత్రం కొంతమంది విదేశాల్లో చేస్తున్నారు తప్ప ఇక్కడ దాదాపు ఎవరూ లేరన్నారని రాష్ట్రపతి తెలిపారు. ఈ పరిస్థితి మారాలని, ప్రాథమిక పరిశోధనలకు ప్రాధాన్యం ఇచ్చినప్పుడే మన దేశం ముందుకు వెళ్తుందని చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...

  • ప్రతిష్ఠాత్మకమైన ఉస్మానియా యూనివర్సిటీ నూరేళ్ల సంబరం చేసుకుంటోంది
  • ఈ సందర్భంలో నేనురావడం గర్వకారణం
  • వందేళ్ల క్రితం ఇదే రోజు.. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్‌కు ఓ కల కన్నారు
  • హైదరాబాద్‌లో యూనివర్సిటీని పెట్టాలని, అది అద్భుత ప్రమాణాలు సాధించాలని అనుకున్నారు
  • అప్పటి నుంచి వందేళ్లు గడిచాయి. 1917 నుంచి 2017 వరకు ఈ వందేళ్లలో ఎన్నో మార్పుచేర్పులు జరిగాయి
  • మీ సొంత రాష్ట్రంలో కూడా పెద్ద మార్పు జరిగింది
  • మొదటి ప్రపంచయుద్ధం తీవ్రస్థాయిలో ఉండగా యూనివర్సిటీ మొదలైంది
  • ఆ తర్వాత 20 ఏళ్లకే మరో ప్రపంచయుద్ధం జరిగింది
  • గత శతాబ్ది మొదటి 50 ఏళ్లలో రెండు ప్రపంచయుద్ధాలు జరిగాయి
  • ఆగస్టు 15 అర్ధరాత్రి ప్రపంచం అంతా గాఢనిద్రలో ఉండగా మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది
  • భారతదేశం సరికొత్త చరిత్రను ఆరంభించింది
  • 1956లో పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ యూజీసీని ఏర్పాటుచేశారు
  • యూనివర్సిటీ అంటే నేర్చుకోడానికి మంచి వేదికే కాదు, ఆలోచనలు పంచుకోడానికి కూడా మంచి అవకాశం
  • అధ్యాపకులు, విద్యార్థులు ఎలాంటి ఒత్తిడులు లేకుండా అభిప్రాయాలు పంచుకుంటారు.. ఇది యూనివర్సిటీకి లక్ష్యంగా ఉండాలి
  • ఒకటి కాదు.. రెండు కాదు.. వందేళ్ల నుంచి ఆ స్ఫూర్తి ఇక్కడ కొనసాగుతోంది
  • భారతదేశం 1500-1600 ఏళ్లుగా అంతర్జాతీయ స్థాయిలో విద్యారంగంలో ముందుంది
  • 15వ శతాబ్దంలోనే నలంద యూనివర్సిటీ ఏర్పాటైంది. తక్షశిల, విక్రమశిల, ఉధంపూర్.. ఇలా చాలా ఉన్నత విద్యాలయాలున్నాయి
  • ప్రపంచం నలుమూలల నుంచి మేధావులైన అధ్యాపకులు వచ్చి, విద్యార్థులతో తమ అభిప్రాయాలు పంచుకున్నారు
  • ఉస్మానియా యూనివర్సిటీ కూడా ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా ఏర్పడింది
  • ఈరోజు ఉన్నత విద్యారంగ మౌలిక సదుపాయాల్లో చాలా అభివృద్ధి సాధించాం
  • మన దేశంలో 757 యూనివర్సిటీలు ఉన్నాయి
  • 16 ఐఐటీలు, 30 ఎన్ఐటీలు, ఐఐసీఆర్, ఐఐఎంలు.. ఇంకా చాలా ఉన్నాయి
  • ఐఐటీల విషయమే చూడండి.. ఇప్పుడు వాటిలో చాలావరకు నూటికి నూరుశాతం క్యాంపస్ నియామకాలు ఉన్నాయి
  • ఐఐటీ పట్టభద్రులు ప్రపంచ మార్కెట్‌లో లీడర్లుగా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎంఎన్‌సీలలో వారే అగ్రగాములుగా ఉన్నారు
  • కానీ మనం వాటితోనే సంతృప్తి పడిపోకూడదు
  • మన యూనివర్సిటీలను కూడా అదే స్థాయికి తీసుకెళ్లాలి
  • ఇప్పటికే ఈ దిశగా కొన్ని చర్యలు తీసుకున్నందుకు సంతోషంగా ఉంది
  • గత ఐదేళ్లుగా ప్రతియేటా స్నాతకోత్సవాలకు వెళ్లినప్పుడు నేను ప్రమాణాలు పెంచుకొమ్మనే చెబుతూ వచ్చాను
  • భారతీయ యూనివర్సిటీలు ప్రపంచంలో అగ్రగాములుగా ఉండాలన్నదే నా తపన
  • ప్రతిష్ఠాత్మకమైన విద్యాసంస్థ నూరేళ్ల సంబరం చేసుకుంటోంది.. ఇప్పుడు మీరు పరిశోధనల గురించి ఆలోచించాలి.
  • ప్రాథమిక పరిశోధన, ఇన్నోవేషన్ జరిగి తీరాలి.. వాటిని చాలావరకు నిర్లక్ష్యం చేస్తున్నారు
  • అన్నింటికీ ప్రభుత్వమే నిధులు ఇవ్వాలంటే కుదరదు.. పారిశ్రామిక వర్గాలు కూడా ముందుకు రావాలి
  • పరిశ్రమలకు కూడా పరిశోధన, శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధి అవసరమే అవుతుంది
  • మార్కెట్ పోటీకి దీటుగా విద్యార్థులు ఎదగాలి
  • ఈ విషయాలన్నీ మీకు తెలియనవి కావు.. మీ అధ్యాపకులు ఇప్పటికే చాలాసార్లు చెప్పి ఉంటారు
  • కానీ వీటిని అమలుచేయాలి. అప్పుడు యూనివర్సిటీ మరో మైలురాయిని చేరుకుంటుంది.
  • మరో పదేళ్లు, పదిహేనేళ్ల తర్వాత మీరు ఇక్కడ ఉండకపోవచ్చు గానీ.. ఓయూ ఇక్కడే ఉంటుంది, మీరు సాధించిన విజయాలుంటాయి
  • తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ మన దేశ విద్యా వ్యవస్థకు రూపకల్పన చేశారు
  • యూనివర్సిటీలలో ఎప్పటికప్పుడు కొత్త శాఖలు రావాలి, కొత్త ప్రాజెక్టులు ఉండాలి, మన మెదడును కూడా అభివృద్ధి చేసుకోవాలి
  • మీ మీ ప్రాంతాల్లో ఉన్న సమస్యలు ఏంటి, వాటిలో వేటిని సులభంగా పరిష్కరించచ్చు అనేది కూడా చూడాలి
  • నన్ను ఈ శతాబ్ది ఉత్సవాలలో పాల్గొనేందుకు ఆహ్వానించిన యూనివర్సిటీ వర్గాలకు ధన్యవాదాలు
  • మీకు అన్నిచోట్లా విజయం చేకూరాలని ఆశిస్తున్నాను

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement