ఫలితాలు కాదు.. పరిశోధనలు కావాలి
విశ్వవిద్యాలయాల పరిస్థితిపై రాష్ట్రపతి ప్రణబ్
- ప్రాచీన కాలంలో ప్రపంచానికి ఆదర్శంగా ఉన్నాం
- ఇప్పుడు దేశంలో ఆశించిన స్థాయిలో పరిశోధనలు జరగడం లేదు
- నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక కావాలి
- విద్యా సంస్థలు పరిశ్రమలతో అనుసంధానం కావాలి
- పరిశోధనల్లో పెట్టుబడులు పెట్టాల్సి ఉందని వ్యాఖ్య
- ఘనంగా ఉస్మానియా శతాబ్ది వేడుకలు ప్రారంభం
- జ్యోతి ప్రజ్వలన చేసి ప్రసంగించిన రాష్ట్రపతి
సాక్షి, హైదరాబాద్: దేశంలోని విశ్వవిద్యాలయాలు కొత్త పరిశోధనలు, ఆవిష్కరణలకు వేదిక కావాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పిలుపునిచ్చారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా అంతర్జాతీయ సమాజంలో మెరుగైన ర్యాంకులను కైవసం చేసుకోవాలని అభిలషించారు. వర్సిటీలను ఉన్నత విద్యకు సంబంధించిన దేవాలయా లుగా తీర్చిదిద్దాలని, అవి జ్ఞానాన్ని బోధించే నిలయాలు గా ఉండాలని పేర్కొన్నారు.
బుధవారం ఉస్మానియా విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలను రాష్ట్రపతి ప్రారంభించారు. క్యాంపస్‌లో నిర్మించనున్న శతాబ్ధి భవన్‌కు శంకుస్థాపన చేసి, వేదికపై నుంచి శిలాఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించారు. ‘‘ఉస్మానియా విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. శాంతియుత సహజీవనాన్ని చాటేందుకు అనువైన ఒక శ్రేష్టతా నిలయాన్ని ఆవిష్కరించాలనే కలతోనే ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏర్పడింది.
వందేళ్ల క్రితం ఇదే రోజు ఒక విజన్‌తో ప్రారంభమైంది. ఈ వందేళ్లలో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మార్పులు వచ్చాయి. ఉన్నత విద్యలో భారతదేశం వందల ఏళ్ల కిందటే ప్రపంచానికిæ ఆదర్శంగా నిలిచింది. ఉన్నత విద్యలో ఇప్పటికే ఎంతో అభివృద్ధి సాధించాం. ఇంకా విప్లవాత్మక మార్పులు వస్తాయి. మేధావుల ఆలోచనలకు విశ్వవిద్యాలయాలు వేదికలుగా నిలుస్తున్నాయి. మరిన్ని కొత్త ఆలోచనలు, పరిశోధనలకు విశ్వవిద్యాలయాలు వేదికలు కావాలి.
దేశంలో మరిన్ని ఐఐటీలు, ఎన్‌ఐటీలు ఏర్పాటు కావాలి. విశ్వవిద్యాలయాలను ఉన్నత విద్యకు సంబంధించిన దేవాలయాలుగా తీర్చిదిద్దాలి. విశ్వవిద్యాలయాలు జ్ఞానాన్ని బోధించే నిలయాలుగా ఉండాలి. అక్కడ ఆలోచనలు స్వేచ్ఛగా పంచుకోవాలి. అటు గురువులు, ఇటు విద్యార్థుల తమ మేధస్సుకు పదునుపెట్టాలి. నిర్భందానికి తావులేని మేధోమథనంతో సంభాషించుకోవాలి..’’అని రాష్ట్రపతి పిలుపునిచ్చారు.
ప్రపంచంలోనే పేరు పొందాం..
ప్రాచీనకాలంలో ఉన్నత విద్యా రంగంలో భారత్ ప్రభావవంతమైన పాత్ర పోషించిందని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఉన్నత విద్యలో ప్రపంచానికి మార్గదర్శిగా నిలిచామన్నారు. 15వ శతాబ్దంలోనే నలంద యూనివర్సిటీ ఏర్పాటైందని.. తక్షశిల, విక్రమశిల వంటి విశ్వవిద్యాలయాలు మేధో సంపదతో ఆకట్టుకున్నాయని చెప్పారు. 1956లో అప్పటి ప్రధాని నెహ్రూ నేతృత్వంలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏర్పాటై వర్సిటీలన్నీ దాని కిందకొచ్చాయని.. విద్యా సంబంధ మౌలిక వసతులు, సదుపాయాల వృద్ధి జరిగిందని పేర్కొన్నారు.
పరిస్థితిలో మార్పు రావాలి
దేశ విద్యా రంగంలో కొన్ని అంశాలు ఇప్పటికీ ఆందోళన కలిగిస్తున్నాయని రాష్ట్రపతి వ్యాఖ్యానించారు. ‘‘ఒకసారి ఖరగ్‌పూర్ ఐఐటీ స్నాతకోత్సవానికి వెళ్లాను. అక్కడ విద్యార్థుల ఫలితాలు, ప్లేస్‌మెంట్స్ గురించి అడిగితే... వందకు వంద శాతమని బదులిచ్చారు. మరి కొత్త పరిశోధనలెన్ని జరిగాయని ప్రశ్నిస్తే.. చాలా మంది విదేశాల్లో పరిశోధనలు చేస్తున్నారనే సమాధానం వచ్చింది. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. వందకుపైగా ఉన్నత విద్యా సంస్థలను సందర్శించాను.
పదేపదే ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాను. ఆశించిన స్థాయిలో పరిశోధనలు జరగడం లేదు. మేధావులు, విద్యార్థులు కొత్త ఆవిష్కరణలు, సాంకేతిక అంశాలపై దృష్టి సారించాలి..’’అని సూచించారు. విద్యా బోధనతోపాటు పరిశోధనలపైనా శ్రద్ధ తీసుకోవాలని స్పష్టం చేశారు. దేశంలోని విశ్వవిద్యాలయాలు అంతర్జాతీయ స్థాయిలో సముచిత స్థానాన్ని కైవసం చేసుకోవాలని చెప్పారు.
ఉన్నత విద్యలో పెట్టుబడులు అవసరం
విద్యా సంస్థలు కేవలం ప్రభుత్వ సహకారంతోనే ముందుకు సాగవని రాష్ట్రపతి స్పష్టం చేశారు. పరిశ్రమలతో ప్రభావవంతమైన చర్చలు జరపాలని, వాటితో అనుసంధానం కావాలని సూచించారు. పరిశోధనలు, ఆవిష్కరణల కోసం పెట్టుబడులు పెట్టాల్సిన ఆవశ్యకత ఉందని... అది జరిగినప్పుడే మనం అంతర్జాతీయ సమాజంలో సముచిత స్థానాన్ని దక్కించుకోగలుగుతామని చెప్పారు. ఈ ఆలోచనలకు ఆచరణాత్మకమైన రూపం ఇవ్వాలని ఆకాంక్షించారు.