పేదరిక నిర్మూలన ఆర్థికాభివృద్ధిలో భాగమే
సబ్సిడీల కోత అందుకు పరిష్కారం కాదు: ప్రొఫెసర్ జయతీ ఘోష్
సాక్షి, హైదరాబాద్: కార్పొరేటు సంస్థల విస్తృతి వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టిందని, కేవలం రుణ మాఫీలు రైతాంగాన్ని ఆదుకోలేవని, పేదరిక నిర్మూలన ఆర్థికాభివృద్ధిలో భాగమేనని ప్రముఖ ఆర్థికవేత్త ప్రొఫెసర్ జయతీ ఘోష్ అన్నారు. ఢిల్లీ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం సెంటర్ ఫర్ ఎకనామిక్ స్టడీస్ అండ్ ప్లానింగ్, స్కూల్ ఆఫ్ సోషల్ స్టడీస్‌లో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆమెను సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ఓ సెమినార్‌కు వచ్చిన సందర్భంగా ‘సాక్షి’ పలుకరించింది.
వ్యవసాయ రంగం సంక్షోభానికి ప్రత్యామ్నాయం?
నూతన ఆర్థిక విధానాల పర్యవసానమే వ్యవసాయ రంగ సంక్షోభం. కార్పొరేట్ సంస్థల విస్తృతి ఈ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టింది. వ్యవసాయ రంగానికి భారత్‌లో సమగ్ర విధానం లేదు. కార్పొరేట్ శక్తులు దీన్ని శాసిస్తున్నంత కాలం ఈ సంక్షోభం నుంచి బయటపడలేం. దశాబ్దాలుగా ఈ రంగాన్ని అలక్ష్యం చేయడం వల్లే ఇప్పుడు రైతులు, దళితులు, స్త్రీలను ఉపాధి మొదలు అన్ని అవకాశాలకూ దూరం చేస్తోంది.
రైతు ఆత్మహత్యలకు పరిష్కారమేమిటి?
ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రజోపయోగమైన వ్యవసాయ విధానాన్ని అనుసరించాలి. కేవలం రుణమాఫీలు రైతాంగాన్ని సంక్షోభం నుంచి బయటపడేయలేవు. తాత్కాలిక ప్రయోజనం మాత్రమే అందిస్తాయి. అవి కూడా వ్యవసాయ కూలీలకు వర్తించనీయడం లేదు. అలాగే రైతుల ఆత్మహత్యల అంచనాలోనే ప్రభుత్వం తప్పుడు విధానాలను అనుసరిస్తోంది. కౌలుదారులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడం లేదు.
రాజధాని పేరుతో ప్రజల భూములను లాగేసుకోవడాన్ని ఎలా చూడాలి?
పంటపొలాలను, అందులోనూ మూడు పంటలు పండే భూములను రైతుల నుంచి లాగేసుకోవడం దుర్మార్గం. నష్టపరిహారంగా మార్కెట్ రేట్ ఒక్కటే ఇస్తే సరిపోదు. దానికి మూడు రెట్లు అధిక ధరను ప్రభుత్వం చెల్లించాలి. అలాగే వారికి అర్బన్ ల్యాండ్ ధరలు ఇవ్వాలి. పరిశ్రమల వల్ల గానీ, ప్రాజెక్టుల వల్లగానీ నిర్వాసితులైన వారికి ఉపాధి అవకాశం యివ్వాలి. ఏ రంగంలో నిర్వాసితులైనా మొదట దాని ప్రభావం స్త్రీలపైనే ఉంటుంది. ముందుగా ఉపాధి కోల్పోయేది స్త్రీలే. కుటుంబ భారమంతా వారిపైనే పడుతుంది. ఏపీలో కూడా జరుగుతున్నదిదే.
వ్యవసాయ రంగంలో స్త్రీ-పురుష అసమానతలను ఎలా అర్థం చేసుకోవాలి?
కార్పొరేట్స్ గుప్పిట్లోనే మన ఆర్థిక రంగం బందీ అయింది. విద్య, ఉద్యోగం అన్నింటినీ ప్రైవేటు పరం చేసేశారు. ఉద్యోగాల కోసం ఒత్తిడి ఎక్కువై... వేతనాల్లో అంతరాలు, లింగ వివక్ష పెరిగాయి. వ్యవసాయ రంగంలో వేతనాల్లో ఈ రోజుకీ అసమానతలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం పెంచి పోషిస్తోన్న ప్రైవేటు రంగాన్ని ప్రశ్నించే వారెవరు? ప్రైవేటీకరణ క్రమేణా ప్రజల హక్కులను హరించివేస్తోంది.
జీఎస్‌టీపై మీ అభిప్రాయం?
బహుళ జాతి కంపెనీలను సంతృప్తి పరచడానికీ, వారిమెప్పు పొందడానికీ మాత్రమే జీఎస్‌టీని తెచ్చారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఎక్కడా ఈ విధానం లేదు.
పేదరిక నిర్మూలనకు చేపట్టాల్సిన చర్యలు?
పేదరిక నిర్మూలన సామాజిక బాధ్యత. ప్రభుత్వం క్రమేణా సామాజిక బాధ్యత నుంచి వైదొలగుతోంది. వేలకోట్ల రూపాయలు బడా పారిశ్రామిక వేత్తలకు రాయితీలు ఇస్తూ, సాధారణ, పేద ప్రజానీకానికి ఇచ్చే సబ్సిడీలకు కోత పెడుతోంది. ఉపాధి దొరకక, ఉద్యోగ భద్రత లేక కార్మికులు వేతన భరోసాలేని కూలీలుగా మారుతున్నారు. ప్రధానంగా స్త్రీలు పనిలేనివారవుతున్నారు. ఆశా వర్కర్లకిచ్చే జీతం రూ.1,500 నుంచి రూ.3,500 లోపు. ఉపాధి హామీకింద పనిచేసే వారికి నెలల తరబడి జీతాలుండవు. ఈ పథకాన్నీ ప్రభుత్వం వదిలించుకోవాలని చూస్తోంది. పేదరిక నిర్మూలన ఆర్థికాభివృద్ధిలో భాగమే.. ఆర్థికాభివృద్ధికి ఆటంకం కాదు. ఈ విషయాన్ని ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయి.