
పక్కాగా ‘పోలీస్’ పరీక్షల నిర్వహణ
పోలీస్ కానిస్టేబుల్, సబ్‌ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నియామకాల కోసం నిర్వహించే పరీక్షలను ఎలాంటి అవకతవకలు జరగకుండా నిర్వహించాలని ఉన్నతాధికారులు, జిల్లాల ఎస్పీలను డీజీపీ అనురాగ్‌శర్మ ఆదేశించారు.
జిల్లా ఎస్పీలను ఆదేశించిన డీజీపీ అనురాగ్‌శర్మ
సాక్షి, హైదరాబాద్: పోలీస్ కానిస్టేబుల్, సబ్‌ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నియామకాల కోసం నిర్వహించే పరీక్షలను ఎలాంటి అవకతవకలు జరగకుండా నిర్వహించాలని ఉన్నతాధికారులు, జిల్లాల ఎస్పీలను డీజీపీ అనురాగ్‌శర్మ ఆదేశించారు. ఏప్రిల్ 3 నుంచి ప్రిలిమినరీ పరీక్షలు ప్రారంభం కానుండటంతో గురువారం డీజీపీ సమీక్ష నిర్వహించారు. దాదాపు 7 లక్షలకు పైగా అభ్యర్థులు హాజరు కానుండటంతో తీసుకుంటున్న చర్యలపై రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ జె.పూర్ణచందర్‌రావు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. జవహర్‌లాల్‌నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం సహకారంతో పరీక్షల నిర్వహణకు అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు.
కానిస్టేబుల్ పరీక్షకు 5.36 లక్షల మంది, ఏప్రిల్ 17న జరగనున్న ఎస్సై ప్రిలిమినరీ పరీక్షకు 1.38 లక్షల మంది హాజరుకానున్నారని, వారికోసం 1,131 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్, బెల్లంపల్లి, మంచిర్యాల, నిర్మల్, సిర్పూర్ కాగజ్‌నగర్, ఉట్నూర్‌లలో 110 సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. కరీంనగర్ జిల్లాలో జగిత్యాల, కరీంనగర్, మంథనిల్లో మొత్తం 106 సెంటర్లు, వరంగల్ జిల్లాలో వరంగల్, జనగాం, నర్సంపేటల్లో 109, ఖమ్మం జిల్లాలో ఖమ్మంతో పాటు భద్రాచలం, కొత్తగూడెం, సత్తుపల్లిలలో 112, నల్లగొండ జిల్లాలో కోదాడ, మిర్యాలగూడ, నల్లగొండ, సూర్యాపేటలలో కలిపి 156, మహబూబ్‌నగర్ జిల్లాలోని గద్వాల, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, నారాయణపేట, షాద్‌నగర్, మహబూబ్‌నగర్‌లలో కలిపి 195 సెంటర్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్, కామారెడ్డి, నిజామాబాద్‌లలో 79, రంగారెడ్డి జిల్లాలో వికారాబాద్ సహా 124, హైదరాబాద్‌లో 74 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించబోమన్నారు. పరీక్షకు నిమిషం ఆలస్యమైనా అనుమతించేదిలేదని చెప్పారు. పరీక్ష కేంద్రానికి అరగంట ముందే రావాలన్నారు. దీంతో వారి వేలిముద్రలు సేకరించడం ద్వారా నకిలీ అభ్యర్థులు పరీక్ష రాయకుండా చేస్తామని పేర్కొన్నారు. సమావేశంలో జేఎన్టీయూ కన్వీనర్ రమణారావు, పోలీస్ అధికారులు సుదీప్ లక్టాకియా, గోపీకృష్ణ, రవిగుప్తా, మహేందర్‌రెడ్డి, సీవీ ఆనంద్, సందీప్ శాండిల్య, సంజయ్ కుమార్ జైన్, నవీన్ చంద్, శ్రీనివాస్‌రెడ్డి, రమేశ్‌రెడ్డి, మల్లారెడ్డి, జిల్లాల ఎస్పీలు పాల్గొన్నారు.