ప్రభుత్వ వైఫల్యలను ఎండగడుతున్న సాక్షి టీవీ ప్రసపారాలను ముద్రగడ దీక్షను సాకుగా చూపి నిలిపివేయడానికి నిరసనగా ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి.
హైదరాబాద్: ప్రభుత్వ వైఫల్యలను ఎండగడుతున్న సాక్షి టీవీ ప్రసపారాలను ముద్రగడ దీక్షను సాకుగా చూపి నిలిపివేయడానికి నిరసనగా ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం నిరంకుశత్వ ధోరణికి నిరసనగా పలు జిల్లాల్లో ప్రజా సంఘాలు, జర్నలిస్టులు.. ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు.
చిత్తూరు జిల్లాలో సాక్షి ప్రాసారాల నిలిపివేతపై బీజేపీ, వామపక్షాలు, ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. గాంధీ సర్కిల్లో సాక్షి ప్రసారాలను పునరుద్దరించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ వైఖరిపై శ్రీకాళహస్తి బార్ అసోసియేషన్ సభ్యులు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన వైఖరిని మార్చుకొని.. సాక్షి టీవీ ప్రసారాలను వెంటనే పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. ప్రసారాలను నిలిపివేయటం దారుణమని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కుమార్ అన్నారు.
కర్నూలులో సాక్షి ప్రసారాల నిలిపివేతపై తీవ్ర నిరసన వ్యక్తమౌతుంది. జర్నలిస్టు సంఘం ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. సాక్షి ప్రసారాలను వెంటనే ప్రారంభించాలన్న డిమాండ్తో అర్థనగ్న ప్రదర్శనకు దిగారు. జిల్లాలోని బనగానపల్లె పట్టణంలో సాక్షి ప్రసారాలను నిలిపివేయటంపై ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీని నిర్వహించారు. నందికొట్కూరులో ప్రజాసంఘాలు, జర్నలిస్టులు సాక్షిపై ప్రభుత్వ ప్రతీకార చర్యలకు నిరసనగా ఆందోళన నిర్వహించారు.
సాక్షి ప్రసారాల నిలిపివేతకు నిరసనగా వైఎస్ఆర్ జిల్లాలోని పులివెందులలో జర్నలిస్టులు నల్లబ్యాడ్జీలు ధరించి ర్యాలీని నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్, కాంగ్రెస్ నేతలు ఈ సందర్భంగా జర్నలిస్టులకు మద్దతు ప్రకటించారు. సాక్షిటీవీ ప్రసారాలను పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నందుకే ప్రభుత్వం ఈ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు.