హైదరాబాద్-అమరావతి మధ్య రైల్వే లింకు
4 నెలల్లో లైన్ సర్వే పూర్తి.. రైల్వే బోర్డుకు నివేదిక
- ప్రభుత్వం భూమి కేటాయించగానే కాజీపేటలో వ్యాగన్ వర్క్‌షాప్
- త్వరలో సికింద్రాబాద్ సహా 36 స్టేషన్ల ఆధునీకరణ
- ఎయిర్‌పోర్టుకు ఎంఎంటీఎస్ పొడిగింపుపై వెనకడుగు
- దక్షిణ మధ్య రైల్వే జీఎం రవీంద్ర గుప్తా వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ఏపీ కొత్త రాజధాని అమరావతికి హైదరాబాద్ నుంచి రైల్వే లింకు కల్పించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్ర గుప్తా వెల్లడించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా అమరావతికి... అక్కడి నుంచి గుంటూరుకు రైళ్లను అనుసంధానించేలా కొత్త లైన్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. రెండేళ్ల రైల్వే పురోగతిపై బుధవారం హైదరాబాద్ రైల్ నిలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కొత్త రైల్వే లైన్‌కు సంబంధించి సర్వే బాధ్యతను రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్‌కు అప్పగించినట్లు గుప్తా తెలిపారు. నాలుగైదు నెలల్లో సర్వే పూర్తవుతుందని, వెంటనే ప్రతిపాదనను రైల్వే బోర్డుకు పంపుతామన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచి ఏపీ కొత్త రాజధాని మధ్య రైలు అనుసంధానం ఉండాలని విభజన చట్టంలో పేర్కొన్న మేరకు రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుందన్నారు.
36 స్టేషన్ల ఆధునీకరణ
దక్షిణమధ్య రైల్వే పరిధిలో తొలి దశలో సికింద్రాబాద్ సహా 36 స్టేషన్లను ఆధునీకరించాలని నిర్ణయించినట్లు గుప్తా వెల్లడించారు. ఇందులో ఐదు ఏ-వన్ స్థాయి స్టేషన్లు, 31 ఏ-క్లాస్ స్టేషన్లు ఉన్నాయన్నారు. దేశవ్యాప్తంగా అభివృద్ధి చేయనున్న 400 స్టేషన్లలో ఇవి భాగమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించగానే చర్లపల్లిలో భారీ రైల్వే టెర్మినల్ నిర్మిస్తామని, హైదరాబాద్‌లోని 3 ప్రధాన స్టేషన్లపై భారం తగ్గించేలా 40-50 ఏళ్ల అవసరాలకు సరిపోయేలా దీనికి రూపకల్పన చేశామన్నారు. గత బడ్జెట్‌లో కాజీపేటకు మంజూరు చేసిన వ్యాగన్ ఓవర్‌హాలింగ్ వర్క్‌షాపు నిర్మాణానికి సిద్ధంగా ఉన్నామన్నా రు. రూ. 290 కోట్ల ప్రాథమిక అంచనాతో ఏర్పాటు చేయనున్న ఈ వర్క్‌షాపునకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 55 ఎకరాలే ఇచ్చిందని... మరో 150 ఎకరాలు ఇవ్వాలన్నారు.
కృష్ణా పుష్కరాలకు 500 ప్రత్యేక రైళ్లు
ఆగస్టులో జరగనున్న కృష్ణా పుష్కరాలకు 500 ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించినట్లు గుప్తా తెలిపారు. 2 వేల అదనపు కోచ్‌లను నడుపుతామని, విజయవాడ, కృష్ణా కెనాల్ జంక్షన్, రాయనపాడు, మధురానగర్, గుణదల, రామవరప్పాడు, విష్ణుపురం, కృష్ణా, గద్వాల్ స్టేషన్లలో ప్రత్యేక షెడ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. విజయవాడ స్టేషన్లో అదనంగా సీసీ టీవీలను, 3 ఎస్కలేటర్లను, విజయ వాడ, గద్వాల స్టేషన్లలో ఇండికేషన్ బోర్డుల్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. కృష్ణా కెనాల్, రాయనపాడు స్టేషన్లలో ఫుట్‌ఓవర్ బ్రిడ్జీలను నిర్మిస్తున్నామన్నారు. ముఖ్య స్టేషన్లలో అదనపు బుకింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ పనులకు రూ.32.68 కోట్లు ఖర్చు చేస్తామన్నారు. 7 స్టేషన్లలో తాత్కాలిక స్టాపేజీతో పాటు అలంపూర్ జోగుళాంబ స్టేషన్‌ను రెగ్యులర్ స్టాప్‌గా మార్చామన్నారు.
అన్ని రంగాల్లో ప్రగతి
గత రెండేళ్లలో దక్షిణ మధ్య రైల్వే అన్ని రంగాల్లో ప్రగతి సాధించిందని గుప్త తెలిపారు. 8 స్టేషన్లను ఆదర్శ స్టేషన్లుగా మార్చామని, 7 స్టేషన్ భవనాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దామన్నారు. అలాగే 14 చోట్ల శుభ్రపరిచే ఆప్రాన్‌లు ఏర్పాటు చేశామని, 10 చోట్ల ప్లాట్‌ఫారాలను విస్తరించామని, మూడు చోట్ల వాణిజ్య అవసరాలకు వీలుగా బహుళ ప్రయోజనకర భవనాలు అభివృద్ధి చేశామని చెప్పారు. 17 కొత్త ఎస్కలేటర్లు, 4 లిఫ్టులు అమర్చామని, 28 స్టేషన్‌లలో 78 వాటర్ వెండింగ్ మెషిన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. కొత్తగా పది రైళ్లు ప్రారంభించామని, 863 ప్రత్యేక రైళ్లు నడిపామన్నారు.
ఎయిర్‌పోర్టుకు ఎంఎంటీఎస్ పొడిగించం
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎంఎంటీఎస్ పొడిగింపు ప్రతిపాదనను విరమించుకున్నట్లు గుప్తా చెప్పారు. ఎయిర్‌పోర్టు లో రైల్వేస్టేషన్ నిర్మాణానికి జీఎంఆర్ స్థలం ఇవ్వననడంతో ఆ ప్రాజెక్టు చేపట్టడం లేదన్నారు. విమానాశ్రయానికి మెట్రో రైలే అనుకూలమని భావిస్తున్నామన్నారు.
2018 నాటికి యాదాద్రికి ఎంఎంటీఎస్
హైదరాబాద్ నుంచి యాదాద్రికి వెళ్లే భక్తుల సౌకర్యం కోసం నిర్మించ తలపెట్టిన ఎంఎంటీఎస్ మూడో దశ ప్రాజెక్టును 2018 నాటికి పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నామని గుప్తా వివరించారు. ఘట్‌కేసర్ నుంచి భువనగరి మీదుగా రాయగిరి వరకు 34 కిలోమీటర్ల మేరకు రూ. 330 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం సహకరిస్తున్న దృష్ట్యా ఇది సకాలంలో పూర్తవుతుందన్నారు.