50 శాతంలోపు పడినా డ్రైస్పెల్‌ | Rainy condition calculation rules was changed by the central | Sakshi
Sakshi News home page

50 శాతంలోపు పడినా డ్రైస్పెల్‌

Published Wed, Sep 13 2017 1:31 AM | Last Updated on Mon, Aug 20 2018 9:18 PM

Rainy condition calculation rules was changed by the central

వర్షాభావ పరిస్థితి లెక్కింపు నిబంధనలు మార్చిన కేంద్రం
 
సాక్షి, హైదరాబాద్‌: వర్షాభావ పరిస్థితులను లెక్కించే విధానంలో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేర్పులు చేసింది. వరుసగా 21 రోజుల పాటు పూర్తిగా వర్షం పడకుంటే ‘డ్రైస్పెల్‌’గా పరిగణించే విధానాన్ని మార్చి.. ఈ 21 రోజుల పాటు 50 శాతంలోపు వర్షపాతం నమోదైనా ‘డ్రెస్పెల్‌’గా పరిగణించాలని నిర్ణయించింది. ఈ మేరకు మార్చిన కరువు మ్యాన్యువల్‌ను రాష్ట్రాలకు పంపి.. దాని ప్రకారం డ్రైస్పెల్‌ మండలాలను లెక్కించాలని సూచించింది. దీనికితోడు పలు ఇతర అంశాలను పరిశీలించి కరువు పరిస్థితులను అంచనా వేయాలని స్పష్టం చేసింది. ఇప్పటివరకు రాష్ట్రంలో ఇతర అంశాలు దారుణంగా ఉన్నా డ్రైస్పెల్‌ నిర్వచనం కారణంగా కరువు మండలాల సంఖ్య తక్కువగా ఉంటూ వచ్చింది.   డ్రైస్పెల్‌ నిర్వచనం మార్చిన నేపథ్యంలో  కరువు మండలాల సంఖ్య పెరగనుంది. 
 
6 అంశాల ఆధారంగా కరువు నిర్ధారణ 
ప్రస్తుతం కరువు నిర్ధారణ అశాస్త్రీయంగా ఉందన్న విమర్శలు ఉన్నాయి. ఆరు అంశాలను కరువు నిర్ధారణకు పరిగణనలోకి తీసుకుంటారు. అందులో 1) వర్షాభావ పరిస్థితులు, 2) డ్రైస్పెల్, 3) తేమ సమగ్ర సూచిక (ఎంఏఐ), 4) నార్మలైజ్డ్‌ డిఫరెన్స్‌ వెజిటేషన్‌ ఇండెక్స్‌ (ఎన్‌డీవీఐ), నార్మలైజ్డ్‌ డిఫరెన్స్‌ వాటర్‌ ఇండెక్స్‌ (ఎన్‌డీడబ్ల్యూఐ), 5) సాగు విస్తీర్ణం, 6) దిగుబడుల పరిస్థితి ఉంటాయి. వీటిలో ఏవైనా ఐదు అంశాల ఆధారంగా కరువుగా ప్రకటిస్తారు. ఒక్కోసారి సడలింపులు ఇచ్చి.. నాలుగు అంశాలను (వర్షానికి వర్షానికి మధ్య 21 రోజులకు మించి అంతరం ఉండడం, సాగు విస్తీర్ణం, పంటల దిగుబడి 50 శాతానికి తగ్గిపోవడం, పశుగ్రాసానికి ఏర్పడిన కొరత ఏర్పడడం) పరిగణనలోకి తీసుకుంటారు.

ఇకఇప్పటివరకు మధ్యస్థంగా, తీవ్ర కరువు ఉన్నప్పుడు మాత్రమే కరువు మండలాలను ప్రకటించారు. ఆ ప్రకారం కేంద్ర ప్రభుత్వం సాయం ప్రకటించేది. అయితే ఆ విధానం ప్రకారం చాలా ప్రాంతాల్లో డ్రైస్పెల్‌గా పరిగణించలేని పరిస్థితి ఉండేది. మూడు వారాల్లో ఒక్కసారి కూడా వర్షం పడకుండా ఉండాలన్నది సరికాదన్న వాదనలు వచ్చాయి. ఆ మూడు వారాల్లో ఒకట్రెండు మిల్లీమీటర్ల వర్షం కురిసినా డ్రైస్పెల్‌గా పరిగణించరని, దాంతో కరువు మండలాల ప్రకటనలో అన్యా యం జరుగుతోందన్న విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో మూడు వారాల్లో ప్రతీ వారం 50 శాతంలోపు వర్షపాతం నమోదైనా డ్రైస్పెల్‌గా పరిగణించాలన్న కొత్త నిబంధనను తీసుకొచ్చారు. 
 
రాష్ట్రంలో 200 మండలాల్లో.. 
రాష్ట్రంలో ప్రస్తుత సీజన్‌లో అనుకున్న స్థాయిలో వర్షాలు కురవలేదు. జూన్‌లో 47 శాతం అధిక వర్షపాతం నమోదు కాగా.. ఆ తర్వాతి నుంచి లోటు వర్షపాతమే నమోదైంది. జూలైలో 40 శాతం, ఆగస్టులో 12 శాతం, ఈ నెలలో ఇప్పటివరకు 27 శాతం లోటు నెలకొంది. చాలా మండలాల్లో డ్రైస్పెల్‌ నెలకొంది. నూతన విధానంలో లెక్కిస్తే రాష్ట్రంలో దాదాపు 200 మండలాలు డ్రైస్పెల్‌లో చిక్కుకున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇలా రెండు సార్లు డ్రైస్పెల్‌ ఉన్న మండలాలను కూడా అధికారులు లెక్కిస్తున్నారు. అయితే ఇంకా స్పష్టత రావాల్సి ఉందని వ్యవసాయశాఖ అధికారి ఒకరు వెల్లడించారు. డ్రైస్పెల్‌ను మార్చిన మాట వాస్తవమేనని, దీనిపై ప్రభుత్వం కూలంకషంగా అధ్యయనం చేస్తోందని తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement