‘నీట్’ భేటీకి రాజేశ్వర్ తివారీ
నేడు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సమావేశం
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, డెంటల్ సీట్లకు దేశవ్యాప్తంగా ఏకీకృత ప్రవేశ పరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో దాని అమలుపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు ‘నీట్’పై కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల వైద్య ఆరోగ్య మంత్రులను హాజరు కావాల్సిందిగా ఆహ్వానించింది. రాష్ట్రం నుంచి మంత్రి లక్ష్మారెడ్డి కాకుండా వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ హాజరుకానున్నారు. నీట్‌ను ఏ విధంగా అమలు చేయాలో ప్రధానంగా చర్చించే అవకాశాలుండగా.. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేపట్టనున్న చర్యలను రాజేశ్వర్ తివారీ కేంద్రానికి వివరిస్తారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలను కేంద్రానికి విన్నవించనున్నట్లు తెలిసింది.
స్థానిక భాషలో నీట్ ఉంటుందా లేదా అన్న అంశంపైనా సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. కేంద్రం నిర్వహించే ప్రత్యేక సమావేశంలో ఎలా వ్యవహరిస్తారన్న విషయాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు బయటకు చెప్పడం లేదు. వివిధ రాష్ట్రాల అభిప్రాయాలకు అనుగుణంగా వ్యవహరించాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఆదివారం ఎంసెట్ పూర్తయిన నేపథ్యంలో ఈసారికి మినహాయింపు కోరే అంశాన్ని లేవనెత్తాలా, వద్దా, అనే మీమాంస రాష్ట్ర అధికారులను పీడిస్తోంది. కాగా, ‘ఈ ఏడాదికి నీట్ నుంచి మినహాయింపు’ ఇవ్వాలంటూ కేంద్రాన్ని కోరాలని ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్యాలు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది.