రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములతో కూడిన చిరు జల్లులు కురుస్తూ వాతావరణం కాస్త చల్లబడ్డా మిగిలిన ప్రాంతాల్లో ఎండలు మండుతున్నాయి.
రామగుండంలో 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములతో కూడిన చిరు జల్లులు కురుస్తూ వాతావరణం కాస్త చల్లబడ్డా మిగిలిన ప్రాంతాల్లో ఎండలు మండుతున్నాయి. గురువారం పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే నాలుగైదు డిగ్రీల మేర ఎక్కువగా నమోదవుతున్నాయి. రామగుండంలో గరిష్టంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. భద్రాచలం, నల్లగొండ, ఖమ్మం, ఆదిలాబాద్‌లలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా రికార్డయ్యాయి. హైదరాబాద్‌లో 41 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదైంది. శుక్ర, శని వారాల్లో వరంగల్, కొత్తగూడెం, నల్లగొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూలు, ఖమ్మం, వనపర్తి, జోగులాంబ గద్వాల తదితర ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని, అయినా పగటి ఉష్ణోగ్రతలు తీవ్రంగానే ఉంటాయని వాతవారణ శాఖ అధికారులు చెప్పారు. వడగాడ్పుల తీవ్రత కూడా ఎక్కువగానే ఉంటుందన్నారు.
వడదెబ్బతో 8 మంది మృతి
వడదెబ్బతో గురువారం వేర్వేరుచోట్ల 8 మంది మృతి చెందారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ముగ్గురు మృతి చెందగా, మృతుల్లో జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలంలోని లక్ష్మీదేవిపల్లికి చెందిన తోట కాపలాదారు కస్తూరి మల్లయ్య (55), గన్నేరువరం మండలకేంద్రానికి బోయిని రాజమల్లు(60), పెద్దపల్లి మండలం పెద్దబొంకూర్ గ్రామానికి చెందిన రైతు బోయిని ఓదెలు (45) ఉన్నారు. అలాగే, సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం రుద్రారం గ్రామానికి చెందిన గుండాడి యాదగిరి (35) వడదెబ్బతో బుధవారం మృతి చెందాడు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వడదెబ్బతో గురువారం నలుగురు మృతి చెందారు. మృతుల్లో పెనుబల్లి మండలం లంకపల్లికి చెందిన కొత్తపల్లి సాయిలు (65), వేంసూరు మండలం వెంకటపురం గ్రామస్తురాలు గండ్ర విజయలక్ష్మి (65), అశ్వారావుపేట మండలం బచ్చువారిగూడేనికి చెందిన రామినేని శాంతమ్మ(90), బోనకల్ మండలం ముష్టికుంట్లకు చెందిన షేక్ సలీం(55) ఉన్నారు.