బహిరంగ చర్చకు సిద్ధం: టీఆర్‌ఎస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ భూములను ఎవరు కొల్లగొట్టారో తేల్చుకోవడానికి బహిరంగ చర్చకు టీడీపీ నేత రేవంత్‌రెడ్డి రావాలని మాజీమంత్రి, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు సవాల్ చేశారు.టీఆర్‌ఎస్ ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సి.లక్ష్మా రెడ్డి, గువ్వల బాలరాజు తదితరులతో కలసి ఆదివారం తెలంగాణభవన్‌లో ఆయన మాట్లాడుతూ తెలంగాణకు చెందిన రూ. వేలకోట్ల విలువైన భూములను చంద్రబాబు ధారాదత్తం చేసినప్పుడు రేవంత్‌రెడ్డి ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. ‘రేవంత్ చేస్తున్న ఆరోపణలపై మీడియా సాక్షిగా బహిరంగచర్చకు మేం సిద్ధ్దం.
మెట్రో భూములను ఎవరికీ కేటాయించలేదు. రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలను రుజువు చేసే దమ్ము, ధైర్యం ఉంటే బహిరంగచర్చకు రావాలి. ఆరోపణలను రుజువు చేయలేకుంటే రేవంత్‌రెడ్డి గుండు గీయించుకుంటడా? అసత్య ఆరోపణలు చేయిస్తున్న చంద్రబాబుకు గుండు గీయిస్తడా? లేదా? అని జూపల్లి సవాల్ చేశారు. మెట్రో భూములపై అర్థంలేని ఆరోపణలతో తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చాలని కుట్రలు చేస్తున్నాడని విమర్శించారు.తెలంగాణ ఏర్పాటుకోసం కేసీఆర్‌తో సహా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి త్యాగాలకు పాల్పడితే మూడేళ్లు దాటినా పదవులను పట్టుకుని వేలాడిన రేవంత్ రెడ్డి లాంటి టీడీపీ నేతలు ఇప్పుడేమో నోటికొచ్చినట్టుగా మాట్లాడితే ప్రజలు క్షమిస్తారా? అని జూపల్లి ప్రశ్నించారు. అసత్య ఆరోపణలతో మెట్రో రైలు ప్రాజెక్టును ఆపాలని చంద్రబాబు కుట్రకు దిగుతున్నాడని విమర్శించారు. కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్ వేరుగా మీడియాతో మాట్లాడుతూ మెట్రో రైలుపై అఖిలపక్షాన్ని అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు అడగలేదని జానారెడ్డిని ప్రశ్నించారు. అప్పుడు నోరు మెదపకుండా ఇప్పుడెందుకు మాట్లాడుతున్నాడని ప్రశ్నించారు.