విచారణకు సిద్ధపడరేం? | ready to to trial? | Sakshi
Sakshi News home page

విచారణకు సిద్ధపడరేం?

Published Mon, Mar 7 2016 1:21 AM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM

విచారణకు సిద్ధపడరేం? - Sakshi

విచారణకు సిద్ధపడరేం?

రాజధానిలో బినామీలతో
భూములు కొనుగోలు చేయించారు
ఇతరులపై బురద జల్లుతున్నారు
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు గడికోట, ఆళ్ల ధ్వజం

 
హైదరాబాద్: రాష్ర్ట రాజధాని భూముల దురాక్రమణ వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిజంగా సచ్ఛీలుడే అయితే సీబీఐతో గానీ, సిట్టింగ్ జడ్జీతోగానీ విచారణకు ఎందుకు సిద్ధపడడం లేదని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు కుమారుడు లోకేశ్‌తోసహా మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు బినామీ పేర్లతో భూములను కొనుగోలు చేయకపోతే విచారణకు ముందుకు రావాలన్నారు. వారు ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజధాని భూదందాపై ‘సాక్షి’ పత్రిక, టీవీలో ఆధార సహిత కథనాలు రావడంతో విచారణకు సిద్ధపడకుండా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాజధానికి ఎక్కడో 500 , 1,000 కిలోమీటర్ల పరిధిలో భూములు కొన్న వారి వివరాలను సేకరించాలని అధికారులను సీఎం పురమాయించారని, దీనర్థం ఇతరులపై బురద జల్లడానికేనన్నారు.
 
వెబ్‌సైట్ నుంచి లావాదేవీలు మాయం
గతంలో హైదరాబాద్ ఔటర్ రింగురోడ్డు నిర్మాణంలో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిపై చంద్రబాబు లెక్కలేనన్ని ఆరోపణలు చేశారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు గుర్తు చేశారు. ఈ ఆరోపణలు రాగానే వైఎస్ స్పందించి సీబీఐ విచారణకు ఆదేశించారన్నారు. ప్రస్తుతం చంద్రబాబు, ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు తప్పు చేశారు కాబట్టే విచారణకు జంకుతున్నారని పేర్కొన్నారు. పత్రికల్లో వచ్చినవన్నీ అవాస్తవాలైతే ప్రభుత్వ వెబ్‌సైట్ నుంచి భూముల రిజిస్ట్రేషన్ లావాదేవీలను ఎందుకు మాయం చేశారో చెప్పాలని గడికోట, ఆళ్ల నిలదీశారు.

అది నిజం కాదు..
భూముల కొనుగోళ్లకు సంబంధించి చాలా తక్కువ లావాదేవీలు జరిగాయని చంద్రబాబు చెప్పడం నిజం కాద ని ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. అసలు భూ లావాదేవీలకు సంబంధించి 99 శాతం అగ్రిమెంట్లు జరిగాయని, అవేవీ రిజిస్ట్రేషన్ కావని పేర్కొన్నారు.ఎక్కడో ఉత్తరాంధ్ర, రాయలసీమ నుంచి టీడీపీ వాళ్లను పిలిపించి ఎందుకు  కొనిపించారని నిలదీశారు.
 
చంద్రబాబుపై నమ్మకం లేదు
 సీఎం చంద్రబాబుపై ప్రధాని నరేంద్ర మోదీకి, రాష్ట్ర ప్రజలకు నమ్మకం లేకుండా పోయిందని గడికోట, ఆళ్ల అన్నారు. రాజధాని నిర్మాణం కోసం కేంద్రం ఇచ్చిన రూ.2,200 కోట్ల నిధులకు సంబంధించి ఇప్పటికీ లెక్క చెప్పలేదన్నారు.
 
లింగమనేని గెస్ట్‌హౌస్ అక్రమ కట్టడమే
చంద్రబాబు తాను నివసిస్తున్న లింగమనేని అతిథి గృహం ప్రభుత్వ ఇల్లు అన్నట్లుగా మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారని, వాస్తవానికి అది అక్రమ కట్టడమేనని ఆళ్ల ఉద్ఘాటించారు. నదుల పరిరక్షణ చట్టం ప్రకారం తాడేపల్లి తహసీల్దార్ దానిని అక్రమ నిర్మాణంగా ప్రకటించి నోటీసులు ఇచ్చారని తెలిపారు.
 
ఫిర్యాదు చేస్తేనే పరిశీలిస్తారా?
 బలవంతంగా భూములు లాక్కున్నట్లుగా రైతులు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదని వైఎస్సార్‌సీసీ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. చంద్రబాబు, ఆయన అనుచరుల బినామీలు రైతుల భూములను తీసుకుని వాటి పై అగ్రిమెంట్లు మాత్రమే చేసుకున్నారని చెప్పారు. రైతులకు ఇంకా పూర్తిగా డబ్బు అందలేదన్నారు. ఈ దశలో ఫిర్యాదు చేయడానికి వస్తే మిగతా డబ్బు కూడా రాదనే ఆందోళనలో రైతులు ఉన్నారని ఆర్కే అన్నారు.
 
ఏది జరిగినా జగన్‌నే నిందిస్తారా?
 మంత్రి రావెల కిశోర్‌బాబు కుమారుడు మహిళను వేధించి జైలుకు వెళితే జగన్‌ను నిందించడం దారుణమని గడికోట విమర్శించారు. కాపు నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాసినా జగన్ కుట్ర ఉందని, మంద కృష్ణమాదిగా మాట్లాడినా జగన్ హస్తం ఉందని నిందించడం ఏమిటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నందమూరి బాలకృష్ణ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం వెనుక కూడా జగనే ఉన్నారంటారా? అని నిలదీశారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement