తెలంగాణలో ప్రాంతీయ తీవ్రవాదం: రావెల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రాంతీయ తీవ్రవాదం రాజ్యమేలుతోందని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీఆర్‌ఎస్ ప్రాంతీయ తీవ్రవాదానికి భయపడే టీడీపీ శాసనసభ్యులు ఆ పార్టీలో చేరుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌లో సచివాలయంలోని తన చాంబర్‌లో శనివారం మంత్రి రావెల విలేకరులతో మాట్లాడారు. ఏపీలో సీఎం చంద్రబాబు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులయ్యే వైఎస్సార్‌సీపీ శాసనసభ్యులు టీడీపీలో చేరుతున్నారని తెలిపారు. తెలంగాణలో టీడీపీ శాసనసభ్యులూ సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులయ్యే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారా అన్న విలేకరులకు ప్రశ్నకు మంత్రి రావెల స్పందిస్తూ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో ప్రాంతీయ తీవ్రవాదం రాజ్యమేలుతోందని, సీఎం కేసీఆర్‌తోపాటూ ఆయన కుటుంబ సభ్యులు దీన్ని పెంచి పోషిస్తున్నారని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌కు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రభుత్వ పనితీరును మెరుగుపర్చడానికే సర్వే నిర్వహించి మంత్రులకు ర్యాంకులు కేటాయిస్తున్నారని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. వాటిని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ర్యాంకులను పరిగణనలోకి తీసుకోనప్పుడు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి సర్వేలు నిర్వహించడం ఎందుకని విలేకరులు ప్రశ్నించగా మంత్రి రావెల నీళ్లు నమిలారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో చదువుతోన్న విద్యార్థులకు గ్రేడింగ్ ఇస్తున్నామని చెప్పారు.