
హెచ్ సీయూలో కొనసాగుతున్న ఆంక్షలు
రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి ఛాయారతన్ ప్రవేశానికి నిరాకరణ
హైదరాబాద్: హెచ్‌సీయూలో ఆంక్షలు కొనసాగుతున్నాయి. విద్యార్థులు, సిబ్బంది మినహా ఎవరినీ లోనికి అనుమతించడంలేదు. శుక్రవారం రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి ఛాయారతన్, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ యోగేంద్రయాదవ్‌ను లోపలికి అనుమతించలేదు. విద్యార్థుల ఆహ్వానం మేరకు క్యాంపస్‌లోని వెలివాడ వద్ద పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొనేందుకు వచ్చిన వారిని ప్రధాన ద్వారం ముందు సెక్యూరిటీ అడ్డుకున్నారు. దీనిపై విద్యార్థులు మండిపడ్డారు. ఛాయారతన్ మాట్లాడుతూ యాజమాన్యాలతో పోరాడుతూ గేట్ మీటింగ్‌లు పెట్టుకునే కంపెనీలా హెచ్‌సీయూ ఉందన్నారు. ఇక్కడ నియంత పాలన నడుస్తోందని, క్యాంపస్‌లో ఉన్న పోలీసులను వెనక్కి పంపించాలని ఆమె డిమాండ్ చేశారు.
ఓ వర్సిటీ ప్రొఫెసర్ మరో యూనివర్సిటీలోకి వెళ్లకుండా అడ్డుకోవడం హేయమైన చర్యని యోగేంద్ర అన్నారు. వీసీ ఏ తప్పు చేయకుంటే మీడియాతోపాటు ఇతరులను లోపలికి రాకుండా ఆంక్షలు ఎందుకు విధించారని ప్రశ్నించారు. వర్సిటీ స్కాలర్ రోహిత్ ఆత్మహత్య ప్రతి భారతీయుడినీ ఆలోచింపజేసిందన్నారు. కాగా, వీసీ అప్పారావు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ హెచ్‌సీయూ విద్యార్థులు శుక్రవారం పరిపాలనా భవనాన్ని ముట్టడించారు. రిజిస్ట్రార్ సుధాకర్‌రావుతోపాటు ఇతర అధికారులు లోపలకు వెళ్లకుండా అడ్డుకున్నారు. సాయంత్రం వరకు ధర్నా నిర్వహించారు.