కుర్చీలో జీయర్‌ను కూర్చోబెడతారా?
ప్రగతిభవన్ ప్రారంభరోజు రాష్ట్రానికి బ్లాక్ డే: రేవంత్
కరీంనగర్: తెలంగాణ ప్రజల చిరకాల వాంఛకు అడ్డుపడిన చిన్నజీయర్‌స్వామిని ప్రగతిభవన్ కుర్చీలో కూర్చోబెట్టి అమరవీరుల ఆత్మ ఘోషించేలా చేసిన సీఎం కేసీఆర్‌ను గన్‌ఫౌండ్రీ వద్ద ఉరితీసినా పాపం లేదని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి అన్నారు. బుధ వారం కరీంనగర్ జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన టీడీపీ కన్వీనర్లు సీహెచ్.విజయరమణారావు, కవ్వంపల్లి సత్యనారాయణ, అన్నమనేని నర్సింగరావులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఉద్యమానికి, రాష్ట్రం సిద్ధిం చడానికి వేదికగా మారిన కరీంనగర్ నుంచే కేసీఆర్ పత నానికి శ్రీకారం చుడుతామన్నారు. ఉద్యమం జరిగి నప్పుడు చిన్నజీయర్‌స్వామి ఏనాడూ తెలంగాణ ఇవ్వా లని మాట్లాడలేదని, అలాంటి వ్యక్తిని అధికార కుర్చీలో ఎందుకు కూర్చోబెట్టారని ప్రశ్నించారు.
నవంబర్ 24 ముమ్మాటికీ బ్లాక్‌డే అవుతుందన్నారు. రాష్ట్రం కోసం 1,569 మంది అమరులైతే 498 కుటుంబాలకు మాత్రమే రూ.10 లక్షలు ఇచ్చారని మండిపడ్డారు. తెలంగాణ ద్రోహులు తుమ్మల, తలసాని చెప్పుచేతల్లో నడుచుకుంటున్నాడని విమర్శిం చారు. కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల ఇప్పటివరకు 89 మంది జర్నలిస్టులు ఆరోగ్య సేవలందక అసువులు బాసారని, రుణమాఫీ అందక 2,700 మంది రైతులు అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.
9 నుంచి టీడీపీ విద్యార్థి పోరు యాత్ర
టీడీపీ అనుబంధ విద్యార్థి సంఘం టీఎన్‌ఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో 9 నుంచి జనవరి 26 వరకు విద్యార్థిపోరును కొనసాగిస్తామన్నారు. దీనిలో భాగంగా రాష్ట్రంలోని 13 విశ్వవిద్యాలయాలను సందర్శించి, విద్యార్థులను చైతన్యవంతులను చేస్తామన్నారు.