
ఇది ‘ప్లాస్టిక్ రోడ్డు’
ఉప్పల్‌లో పైలట్ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభం
హైదరాబాద్: మహానగరంలో తొలిసారిగా ప్లాస్టిక్ వ్యర్థాలతో రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. జీహెచ్‌ఎంసీ ప్రయోగాత్మకంగా నాగోలు బ్రిడ్జి నుంచి ఉప్పల్ మెట్రో స్టేషన్ వరకు రూ.11 లక్షల అంచనా వ్యయంతో దీన్ని చేపట్టింది. పైలట్ ప్రాజెక్టుగా ఆదివారం ప్రారంభమైన ఈ రోడ్డు 16 మీటర్ల వెడల్పుతో వంద మీటర్ల దూరం పూర్తయింది. జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ పనులు ప్రారంభించారు. నగరంలో అధిక శాతం రోడ్లు చిన్నపాటి వర్షానికే దెబ్బతింటుండడంతో ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతోందని.. ఈ ప్లాస్టిక్ రోడ్ల నిర్మాణంతో సమస్య తీరుతుందని ఆయన చెప్పారు. ‘బీటీ, సిమెంట్ రోడ్లతో పోలిస్తే ప్లాస్టిక్ రహదారులు పది కాలాల పాటు మన్నికగా ఉంటాయి.
గుంతలు, నీరు నిలవడం వంటి సమస్యలుండవు. 8 శాతం ప్లాస్టిక్‌ను నిర్మాణంలో వాడతారు. ప్లాస్టిక్ వ్యర్థాలు తగ్గి పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది’ అని మదురైలోని త్యాగరాజ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాల సాంకేతిక విభాగం సలహాదారు ఆర్.వాసుదేవన్ తెలిపారు.