
కేపీహెచ్‌బీ కాలనీలో దొంగల బీభత్సం
హైదరాబాద్ : కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో దోపిడీ దొంగలు స్వైరవిహారం చేశారు. ఒకేరోజు మొత్తం 7 చోట్ల దొంగలు బీభత్సం సృష్టించారు. కేపీహెచ్‌బీ ఏడో ఫేజ్‌లో తాళం వేసున్న ఒక ఇంట్లో శనివారం రాత్రి దొంగలు పడి విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. సమీపంలోని ప్రగతినగర్‌లోని ఓ ఇంట్లో రూ.10 లక్షల నగదు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది.
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. బాధితులు అందుబాటులో లేకపోవడంతో.. ఎంత మొత్తం చోరీకి గురైంది అనే విషయంలో స్పష్టత రాలేదు. శనివారం రాత్రి వర్షం కురుస్తున్న సమయంలో ఈ దొంగతనాలకు పాల్పడి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. సంఘటనా స్థలానికి సమీపంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫూటేజిల ఆధారంగా దొంగలను గుర్తించేందుకు పోలీసులు యత్నిస్తున్నారు.