డబ్బు కాజేసి దోపిడీ నాటకం...
సాక్షి, సిటీబ్యూరో : జూబ్లీహిల్స్‌లో మంగళవారం సాయంత్రం జరిగిన భారీ దోపిడీ కేసును కేవలంలో 12 గంటల్లోనే వెస్ట్‌జోన్, జూబ్లీహిల్స్ పోలీసులు ఛేదించారు. ఫిర్యాదు చేసిన ఉద్యోగులే ఆ డబ్బును కాజేసి దోపిడీ నాటకం ఆడారని తేల్చారు. నిందితుల నుంచి రూ. 20.61 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. బషీర్‌బాగ్‌లోని హైదరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో బుధవారం కమిషనర్ మహేందర్‌రెడ్డి కేసు వివరాలు వెల్లడించారు.
లగ్జరీ లైఫ్ కోసమే దారి తప్పారు...
జూబ్లీహిల్స్‌లోని హజల్ మార్కెటింగ్ కార్యాలయంలో కరీంనగర్‌కు చెందిన బిల్లా శ్రీనివాస్ సేల్స్ కో-ఆర్డినేటర్‌గా, తూర్పుగోదావరికి చెందిన ఇంజవరపు రమేశ్ ఆఫీస్ బాయ్ కమ్ డ్రైవర్‌గా ఐదేళ్లుగా పని చేస్తున్నారు. జూబ్లీహిల్స్ రోడ్డు నెం.71లో ఉన్న ఎస్‌ఎంఎస్ ఫార్మా కంపెనీ వద్ద హజల్ కంపెనీ రసాయనాలు తీసుకొని వివిధ కంపెనీలకు విక్రయిస్తుంది. ఇలా విక్రయించగా వచ్చిన కలెక్షన్ డబ్బును రోజూ సాయంత్రం ఎస్‌ఎంఎస్ ఫార్మా కార్యాలయంలో డిపాజిట్ చేస్తారు.
ఈ పని అంతా హజల్ మార్కెటింగ్ మేనేజర్ శేఖర్ పర్యవేక్షిస్తారు. ఇతని వద్దే పని చేస్తున్న నిందితులు శ్రీనివాస్, ఇంజవరపు రమేశ్ నగరంలోని లగ్జరీ లై ఫ్‌స్టైల్ చూసి తాము కూడా అలా ఉండాలనుకున్నారు. ఇందుకు తమ జీతం సరిపోకపోవడంతో కంపెనీ డబ్బు కాజేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు శ్రీనివాస్ విద్యానగర్‌లో ఉంటున్న తన స్నేహితుడు తుని సురేశ్ సహకారం తీసుకున్నాడు. రోజూ మాదిరిగానే మంగళవారం వివిధ ప్రాంతాల నుంచి కలెక్షన్ చేసిన రూ. 20 లక్షల 61 వేలను జూబ్లీహిల్స్‌లోని తమ కంపెనీకి తీసుకొచ్చారు.
అప్పటికే సాయంత్రం కావడంతో మేనేజర్ శేఖర్ ఆ డబ్బును ఎస్‌ఎంఎస్ ఫార్మా కంపెనీలో డిపాజిట్ చేయమన్నాడు. దీంతో వారు సాయంత్రం 6 గంటలకు ఆ డబ్బు తీసుకొని బైక్‌పై బయలుదేరారు. ముందే వేసుకున్న పథకం ప్రకారం పెద్దమ్మ గుడి సమీపంలో వేచివున్న సురేశ్‌కు డబ్బు ఇచ్చి పంపేశారు. సాయంత్రం 6.15కి మేనేజర్ శేఖర్‌కు ఫోన్ చేసి పల్సర్ బైక్ వచ్చిన ఇద్దరు దుండగులు డబ్బు ఉన్న బ్యాగ్‌ను లాక్కెళ్లారని, వారిని వెంబడిస్తున్నామని చెప్పి గంటపాటు అటు ఇటు తిరిగారు. తర్వాత రాత్రి 9.15కి శేఖర్‌తో కలిసి వచ్చి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గుట్టు విప్పిన సీసీ కెమెరాలు...
వీరి ఫిర్యాదు ప్రకారం జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 36 నుంచి నేరం జరిగిందని చెప్పిన ప్రాంతం వరకు వివిధ ప్రాంతాల్లోని సిగ్నల్స్‌లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు పరిశీలించగా... శ్రీనివాస్, రమేశ్‌లను ఎవరూ వెంబడించలేదని తేలిపోయింది. దీంతో పోలీసులు ఇద్దరినీ వెంటనే అదుపులోకి తీసుకొని విచారించగా పథకం ప్రకారమే ఆ డబ్బు కాజేసి తమ స్నేహడితుడు సురేష్‌కు అందజేశామన్నారు.
పోలీసులు విద్యానగర్‌లోని సురేష్ రూమ్‌పై దాడి చేసి డబ్బును స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం రాత్రి 9.15కి నమోదైన కేసును బుధవారం ఉదయం 9.15కి.. అంటే కేవలం 12 గంటల్లోనే వెస్ట్‌జోన్ పోలీసులు ఛేదించడం గమనార్హం. విలేకరుల సమావేశంలో వెస్ట్‌జోన్ డీసీపీ ఎ.వెంకటేశ్వర రావు, బంజారాహిల్స్ డివిజన్ ఏీసీపీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి, జూబ్లీహిల్స్ పోలీసు ఇన్‌స్పెక్టర్ వెంకట్ రెడ్డి, అడిషనల్ ఇన్‌స్పెక్టర్ ముత్తుతో పాటు వెస్ట్‌జోన్ టీం సభ్యులు పాల్గొన్నారు.