'ఆ సమస్య ఇంకొకరితో చెప్పుకునేది కాదు'
జూబ్లీహిల్స్: 'అత్యవసరమైన' నిత్యావసరాలు తీర్చుకునేందుకు ఇంటిలో 'మరుగు' సదుపాయం లేకుంటే మహిళలు పడే బాధ అంతా ఇంతా కాదు. ఇది ఇంకొకరితో చెప్పుకునేది కాదు. ఇక పల్లెల్లోనైతే మరీ దుర్భరం. కేంద్ర ప్రభుత్వమే స్పందించి మరుగుదొడ్లు ఏర్పాటుకు నడుం బిగించిందంటే దేశంలో పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో తెలుసుకోవచ్చు. గ్రామాల్లో మహిళలు పడే 'మరుగు' కష్టాలను సాటి మహిళగా గుర్తించారు
మన తెలుగు తేజం రోహిణి సింధూరి. ప్రభుత్వ ఉన్నతాధికారిగా కర్తవ్య దీక్షకు పూనుకున్నారు. గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణాన్ని ఉద్యమంలా చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'స్వచ్ఛ భారత్ అభియాన్' పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తూ దేశంలో మూడో స్థానం సాధించారు. ఐఏఎస్ అధికారిగా భ్రూణ హత్యలపై ప్రజలను చైతన్యం చేస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. బెంగళూరులో సాప్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న భర్త సుధీర్‌రెడ్డితో కలిసి ఇటీవల హైదరాబాద్ వచ్చిన సింధూరి 'సాక్షి'తో ముచ్చటించారు. ఆ వివరాలు సింధూరి మాటల్లోనే..
ఇదీ నేపథ్యం..
మా తల్లిదండ్రులు జైపాల్‌రెడ్డి, శ్రీలక్ష్మి. మాది ఖమ్మం జిల్లాలోని రుద్రాక్షపల్లి గ్రామం. నేను, చెల్లి, తమ్ముడు అక్కడే పుట్టాం. ప్రాథమిక విద్యాభ్యాసం కూడా అక్కడే సాగింది. నాన్నకు న్యాయవాదిగా ప్రాక్టీస్ పెరగడంతో హైదరాబాద్ వచ్చేశాము. నగరంలోనే ఇంటర్, ఇంజినీరింగ్ పూర్తి చేశా. స్నేహితులను చూసి సివిల్స్ రాశా. మెదటి ప్రయత్నంలోనే ఐఏఎస్ సాధించాను. కర్ణాటక క్యాడర్‌కు ఎంపికై ఐదేళ్లుగా అక్కడే పనిచేస్తున్నా. ప్రస్తుతం మాండ్య జిల్లా పరిషత్ సీఈవోగా విధులు నిర్వహిస్తున్నా.
మరుగుదొడ్ల ఏర్పాటుపై దృష్టి..
జిల్లా పరిషత్ సీఈవోగా మాండ్య జిల్లా సామాజిక పరిస్థితులపై అధ్యయనం చేశాను. కావేరి నదీ తీరంలోని ఈ జిల్లాలో దాదాపు 4 లక్షల ఇళ్లున్నాయి. అభివృద్ధి చెందిన జిల్లా అయినప్పటికీ పల్లెల్లో మహిళల భద్రత దారుణంగా ఉంది. బహిర్భూమికి వెళ్లిన ఆరవ తరగతి విద్యార్థిని అత్యాచారానికి గురికావడం నన్ను కలచివేసింది. దీనికి ఇంటి ఆవరణలో మరుగుదొడ్లు లేకపోవడమే కారణంగా గుర్తించాను. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో పెద్దసంఖ్యలో మరుగుదొడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకున్నా. ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 90 వేల మరుగుదొడ్ల నిర్మించాం. భవిష్యత్తులో 1.4 లక్షల మరుగుదొడ్లు నిర్మించాలని లక్ష్యంగా పనిచేస్తున్నా.
దేశంలోనే రికార్డ్...
మరుగుదొడ్ల నిర్మాణంలో పశ్చిమ బెంగాల్‌లోని నాడియా, రాజస్థాన్‌లోని బికనీర్ జిల్లాలు ప్రథమ, ద్వితీయ స్థానాల్లో ఉండగా, కర్ణాటకలోని మాండ్య జిల్లాను మూడవ స్థానంలో నిలిపా. నా కృషిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం గత మార్చిలో ఢిల్లీలో 'ఓపెన్ డిఫెక్షన్ ఫ్రీ' పేరుతో నిర్వహించిన కార్యక్రమానికి నన్ను రిసోర్స్ పర్సన్‌గా ఎంపిక చేసింది. దేశవ్యాప్తంగా వచ్చిన కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, సీఈవోలకు రెండు రోజులపాటు శిక్షణ ఇవ్వడం మరిచిపోలేను.
మాండ్య జిల్లాలో భ్రూణ హత్యల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నా. ఇందులో భాగంగా లింగ నిర్థారణ పరీక్షలు నిర్వహిస్తున్న డయాగ్నస్టిక్ సెంటర్లు, నర్సింగ్ హోమ్‌లపై ఉక్కుపాదం మోపాము. ఇప్పటివరకు దాదాపు 40 క్లినిక్‌లు, డయాగ్నస్టిక్స్ సెంటర్లను మూసివేసి, నిర్వాహకులపై కేసులు నమోదు చేశాం. భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాల ద్వారా ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నా అంటూ ముగించారు.