చెక్కుల్లో అంకెలు మార్చేస్తూ.. | Rs 5.87 crore fraud at HMDA unearthed, 3 arrested | Sakshi
Sakshi News home page

చెక్కుల్లో అంకెలు మార్చేస్తూ..

Published Sat, Mar 26 2016 2:17 PM | Last Updated on Sun, Sep 3 2017 8:38 PM

Rs 5.87 crore fraud at HMDA unearthed, 3 arrested

     సెక్యూరిటీ సంస్థ పేరుతో భారీ మోసం
     రూ.5.87 కొల్లగొట్టినట్లు తేల్చిన పోలీసులు
     హెచ్‌ఎండీఏ అడ్మిన్ అధికారి హస్తం
     మోసాన్ని బట్టబయలు చేసిన ఓయూ పోలీసులు


అంబర్‌పేట: చెక్కుల్లో అంకెలు మార్చేస్తూ హెచ్‌ఎండీఏకు రూ.కోట్లలో టోపీ పెట్టిన ఉదంతం ఒకటి వెలుగు చూసింది. ఓ సెక్యూరిటీ సంస్థకు చెందిన ఉద్యోగి, హెచ్‌ఎండీఏలోని ఓ అధికారి నిర్వాకం కారణంగా దాదాపు రూ.5.87 కోట్లు దారిమళ్లాయి. ఇటీవల చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్‌కు అనుమానం రావడంతో మోసం బట్టబయలైంది. శుక్రవారం అంబర్‌పేటలోని ఈస్ట్‌జోన్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ డాక్టర్ వి.రవీందర్ ఈ మోసానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. హెచ్‌ఎండీఏ సంస్థ నిర్వహిస్తున్న పలు ప్రాంతాల్లో భద్రత కోసం ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో ఉన్న సాయి సెక్యూరిటీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకొని నెలనెలా డబ్బులు చెల్లిస్తుంది. ఈ సంస్థలో 2008లో బోడుప్పల్‌కు చెందిన శంకర్‌నాయక్  ఫీల్డ్ ఆఫీసర్‌గా చేరాడు. విధుల్లో భాగంగా హెచ్‌ఎండీఏ సంస్థ సాయిసెక్యూరిటీ సంస్థకు చెల్లిస్తున్న నెలవారి చెక్కులను తీసుకువచ్చేవాడు.

కొన్నాళ్ల తరువాత సులువుగా డ బ్బులు సంపాదించాలనే ఆశతో పక్కా ప్రణాళిక వేశాడు. వెంటనే సాయి సెక్యూరిటీలో ఉద్యోగం మానేశాడు. అయినా హెచ్‌ఎండీఏ చెల్లిస్తున్న డబ్బులను నమ్మకంతో సాయి సెక్యూరిటీ సంస్థకు అందిస్తూ వస్తున్నాడు. హెచ్‌ఎండీఏ సంస్థలో శేరిలింగంపల్లికి చెందిన ఎల్చూరి విజయ్‌మోహన్‌కృష్ణ అడ్మిన్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తూ చెక్కులు జారీ చేస్తాడు. ఇతనితో పాటు నల్లకుంట అచ్చయ్యనగర్‌కు చెందిన రాజు, హామీద్ లకు పథకం వివరించి సాయి సెక్యూరిటీ సంస్థ పేరిట ఖాతా తెరిచారు. అనంతరం హెచ్‌ఎండీఏ జారీ చేసిన చెక్కులపై ఉన్న అంకెలను మారుస్తూ వీరు తెరిచిన ఖాతాలో జమ చేసి చెక్కు క్లియర్ కాగానే...ఎక్కువగా మార్చిన సొమ్మును వీరు తీసుకుంటూ... అసలైన చెక్కు సొమ్మును సాయి సెక్యూరిటీ సంస్థకు ఎవరికి అనుమానం రాకుండా చెల్లిస్తూ వస్తున్నారు. ఇలా వీరు గత 8 ఏళ్లుగా నిరాటంకంగా మోసానికి పాల్పడుతూ రూ. 5.87 కోట్లు కొల్లగొట్టారు.

కాగా ఈ మోసాన్ని గుర్తించిన హెచ్‌ఎండీఏ చీఫ్ అకౌంట్ ఆఫీసర్ ఎండీ అన్వర్ హమీద్ ఈ నెల 15వ తేదీన ఓయూ పోలీసులకు రూ. 1.28 కోట్ల నేరం మోసం జరిగినట్లు పిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న ఓయూ ఇన్‌స్పెక్టర్ వి.అశోక్‌రెడ్డి లోతుగా దర్యాప్తు చేసి మొత్తం రూ. 5.87 కోట్లు మోసం జరిగిందని తేల్చారు. దీనికి బాధ్యులైన శంకర్‌నాయక్, ఎల్చూరి విజయ్‌మోహన్‌కృష్ణ, రాజు, హమీద్‌లను వారి ఇళ్ల వద్ద గురువారం రాత్రి అరెస్టు చేశామన్నారు.  ఈ సమావేశంలో కాచిగూడ  ఏసీపీ లక్ష్మీనారాయణ, ఓయూ ఇన్‌స్పెక్టర్ అశోక్‌రెడ్డి, ఎస్‌ఐలు పాల్గొన్నారు. కేసును సవాల్‌గా తీసుకొని మోసాన్నిగుట్టు రట్టు చేసిన ఇన్‌స్పెక్టర్‌తో పాటు సంబంధిత సిబ్బందిని డీసీపీ అభినందించారు. అంతే కాకుండా రివార్డు కూడా అందిస్తామన్నారు.

 భారీగా సొత్తు స్వాదీనం..
 శంకర్‌నాయక్ నుంచి రూ. 9.75 లక్షల నగదు, 8 లక్షలు బంగారు అభరణాలు, రూ. 3.73 కోట్ల విలువైన ల్యాండ్ డాక్యుమెంట్లు, 60 లక్షలు విలువ చేసే ఖరీదైన కార్లు, రూ. 5 లక్షలు విలువ చేసే ఇన్సూరెన్స్ బాండ్లను స్వాధీనం చేసుకున్నారు. విజయ్‌మోహన్ కృష్ణ వద్ద నుంచి రూ. 20.79 లక్షల నగదు, 25 లక్షల విలువ చేసే ల్యాండ్ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.  కాజేసిన మొత్తంలో 86 శాతం రికవరీ చేసినట్లు డీసీపీ వెల్లడించారు. అనంతరం ముగ్గురిని రిమాండ్‌కు తరలించినట్లు ఆయన తెలిపారు.
 

 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement