
సాక్షి, హైదరాబాద్: రంజాన్‌ను పురస్కరించుకుని మసీదుల మరమ్మతుకు రూ.5 కోట్లు కేటాయించినట్లు ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ వెల్లడించారు. శుక్రవారం ఆయన సచివాలయంలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, మైనారిటీ సంక్షేమ శాఖ సలహాదారు ఎ.కె.ఖాన్, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ మహ్మద్ సలీం, నగర శాసనసభ్యులు, వివిధ శాఖల అధికారులతో కలసి రంజాన్ ఏర్పాట్లను సమీక్షించారు.
అనంతరం మహమూద్ అలీ మాట్లాడుతూ వచ్చే నెలలో రంజాన్ పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా సుమారు నాలుగు లక్షల పేద ముస్లి కుటుంబాలకు దుస్తులు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. ప్రజలకు ఇబ్బందులు ఎదురుకాకుండా పోలీసు యంత్రాంగం 24 గంటలు పనిచేస్తుందని నాయిని అన్నారు. పండుగ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసే ముస్లిం సోదరులు గంట ముందుగా ఆఫీసు విడిచి వెళ్లడానికి అనుమతించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.