
రంజాన్‌కు ఘనంగా ఏర్పాట్లు చేయండి
అధికారులకు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: రంజాన్ పండుగను పురస్కరించుకుని ముస్లిం సోదరులకు ఇబ్బందులు తలెత్తకుండా ఘనంగా ఏర్పాట్లు చేయాలని వివిధ శాఖల అధికారులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ఆదేశించారు. సోమవారం సచివాలయంలో మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తల సాని శ్రీనివాస్‌యాదవ్, మైనారిటీ సంక్షేమ శాఖ సలహా దారు ఏకే ఖాన్, నగర శాసనసభ్యులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. రంజాన్ మాసం ప్రారంభమైనప్పటి నుంచి పండుగ వరకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం జరుగకుండా చర్యలు చేపట్టాలని విద్యుత్ శాఖ అధికారులను మహమూద్ అలీ ఆదేశించారు.
మసీదుల వద్ద ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా జీహెచ్‌ఎంసీ అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. పాతబస్తీలో తాగునీరు, రోడ్ల మరమ్మతులు, వీధి దీపాలు, ప్రత్యేక డంపింగ్ బిన్‌లను ఏర్పాటు చేయాలని అధి కారులకు సూచించారు. చార్మినార్ ప్రాంతంలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేయాలన్నారు. పండుగ సందర్భంగా 24 గంటలు హోటల్స్ తెరిచే ఉంటాయన్నారు. మసీద్‌ల రిపేర్ల నిమిత్తం రూ.5 కోట్లు, మక్కా మసీద్ రిపేరు కోసం రూ.8.48 కోట్లు కేటాయించామన్నారు.
ప్రభుత్వ కార్యాల యాల్లో పని చేసే ముస్లిం ఉద్యోగులకు గంట ముందుగా ఆఫీసు విడిచి వెళ్లడానికి ప్రభుత్వం అనుమతినిచ్చిందన్నారు. సమావేశంలో వక్ఫ్ బోర్డ్ చైర్మన్ మహ్మద్ సలీం, ఎమ్మెల్యేలు చింతల రాంచంద్రారెడ్డి, అహ్మద్ పాషాఖాద్రి, ముంతాజ్ అహ్మద్ ఖాన్, మోజంఖాన్, మాగంటి గోపీనాథ్, జాఫర్ హుస్సేన్, అహ్మద్ బిన్ బలాల, జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్, కమిషనర్ జనార్దన్‌రెడ్డి, జలమండలి ఎండీ దానకిషోర్, విద్యుత్ శాఖ సీఎండీ రఘుమారెడ్డి, మైనారిటీ సంక్షేమశాఖ కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ తదితరులు పాల్గొన్నారు.