
రూ.5 ఇవ్వలేదని అదృశ్యం
పంజగుట్ట: తల్లిని ఐదు రూపాయలు అడిగితే ఇవ్వలేదని అలిగి ఓ యవకుడు కనిపించకుండా పోయాడు. పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... ముషీరాబాద్ బంగ్లాదేశ్ బస్తీలో నివాసముండే శివ(10) స్థానిక ముషీరాబాద్ ప్రభుత్వ పాఠశాలలో నాల్గో తరగతి చదువుతున్నాడు. తల్లి సరస్వతితో కలిసి మంగళవారం సోమాజిగూడలోని బంధువుల ఇంటికి వచ్చాడు. బుధవారం ఉదయం 10.30కి శివ తల్లిని రూ.5 అడిగాడు.
ఆమె ఇవ్వకపోవడంతో ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. పలుచోట్ల వెతికినా ఫలితం లేకపోవడంతో తల్లి పంజగుట్ట పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు ఫోన్: 9490616610 నెంబర్‌లో సంప్రదించాలని ఇన్‌స్పెక్టర్ మోహన్ కుమార్ తెలిపారు.