ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించ తలపెట్టిన ఒకరోజు సమ్మె యథావిధిగా జరిగే అవకాశమే కనిపిస్తోంది.
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించ తలపెట్టిన ఒకరోజు సమ్మె యథావిధిగా జరిగే అవకాశమే కనిపిస్తోంది. ఆర్టీసీవైపు నుంచి చర్చలకు సరైన పద్ధతిలో పిలుపు రాలేదన్న ఉద్దేశంతో ఒకరోజు సమ్మెను నిర్వహించాలని నిర్ణయించినట్టు జేఏసీ ప్రకటించింది. కార్మిక సంఘాలతో చర్చలు జరపాలంటూ టీ-జేఏసీ చైర్మన్ చేసిన మధ్యవర్తిత్వం విఫలమైంది. బుధవారం సాయంత్రం కోదండరాం తదితరులు ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణతో భేటీ అయ్యారు. ఆర్టీసీ బలోపేతం, కార్మికుల బకాయిల చెల్లింపు డిమాండ్‌తో ఒకరోజు సమ్మెకు సిద్ధమైన ఆర్టీసీ జేఏసీ నేతలను చర్చలకు ఆహ్వానించాలని సత్యనారాయణకు సూచించారు. బుధవారం మధ్యాహ్నం ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో పాల్గొన్న అనంతరం కోదండరాంచైర్మన్‌తో భేటీ అయ్యారు.
శాంతియుత వాతావరణంలో చర్చల ద్వారా సమస్యలు పరిష్కారమవుతాయని, కార్మికుల డిమాండ్లను విని సానుకూలంగా స్పందించాలని కోరారు. చర్చలకు తానేమీ వ్యతిరేకం కాదని ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ పేర్కొన్నారు. గతంలో గుర్తింపు సంఘంగా ఉన్న ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులు వస్తే చర్చించేందుకు సిద్ధమేనని ఆయన ప్రకటించారు. ఆర్టీసీ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సమయంలో కూడా 44 శాతం ఫిట్మెంట్ ప్రకటించామని, కానీ దాని బకాయిల చెల్లింపులో కాస్త ఆలస్యమైతే ఏకంగా సమ్మె చేస్తామనటం ఎంతవరకు సమంజసమని సత్యనారాయణ ప్రశ్నించారు. అయితే జేఏసీగా ఉన్న నేపథ్యంలో అన్ని సంఘాల ప్రతినిథులతో కూడిన బృందాన్ని చర్చలకు పిలవాలని, ఒకే సంఘాన్ని ఆహ్వానించటం సరికాదని జేఏసీ నేతలు పేర్కొంటున్నారు. ఆర్టీసీ నుంచి సానుకూల స్పందన రానందున గురువారం తెల్లవారుజామున తొలి సర్వీసును ఆపేయటం ద్వారా సమ్మె మొదలుపెడతామని పేర్కొన్నారు.