బూట్లు.. బుక్స్ ఏదైనా బాదుడే! | Sales counters, and more | Sakshi
Sakshi News home page

బూట్లు.. బుక్స్ ఏదైనా బాదుడే!

Published Sun, Jun 12 2016 12:39 AM | Last Updated on Mon, Sep 4 2017 2:15 AM

బూట్లు.. బుక్స్   ఏదైనా బాదుడే!

బూట్లు.. బుక్స్ ఏదైనా బాదుడే!

{Oపెవేట్ స్కూళ్ల మాయాజాలం
టై నుంచి పుస్తకాల వరకు అదనపు వసూళ్లు
పాఠశాల ఆవరణలోనే కౌంటర్లు పెట్టి మరీ విక్రయాలు
తల్లిదండ్రుల నెత్తిన మోయలేని భారం

 

సిటీబ్యూరో:  ప్రైవేటు స్కూళ్లలో దోపిడీకి ఎన్నో దారులు..ఎన్నెన్నో రూపాలు. అందివచ్చిన ఏ అవకాశాన్నీ వదలడం లేదు. శక్తిమేర పిల్లల తల్లిదండ్రులను పీల్చిపిప్పి చేస్తున్నా..పట్టించుకునే నాథుడే లేడు. పిల్లలు పెట్టుకునే ‘టై’ నుంచి  యూనిఫాం వరకు...అన్నింటా బాదుడే బాదుడు. అంతేగాదు...పాఠశాలలను చివరకు సేల్స్ స్టోర్స్‌గానూ మార్చేశారు. నగరంలోని దాదాపు అన్ని ప్రైవేటు స్కూళ్లలో ఇదే పరిస్థితి. ఫీజులే కాకుండా బుక్స్, నోట్‌బుక్స్, షూస్, సాక్స్, పలకలు, పెన్నులు, చాక్‌పీస్‌లు, బ్యాగుల అమ్మకాల ద్వారా పాఠశాలల యాజమాన్యాలు రూ. కోట్లు వెనకేసుకుంటున్నాయి. ఇదంతా నిబంధనలకు విరుద్ధమే. తనిఖీలకు వెళ్లిన అధికారులకు ఇవన్నీ కంట పడినా.. చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. అధికారులూ  పట్టించుకోకపోవడంతో...  తల్లిదండ్రులూ తప్పక భారాన్ని భరిస్తున్నారు.

 

 
నిబంధనలకు పాతర

పాఠశాలల పునఃప్రారంభ సమయాన్ని స్కూళ్లు బాగా వాడుకుంటున్నాయి. ఇప్పటికే ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తుండగా.. మరోవైపు అభ్యసనా సామగ్రి, యూనిఫాంలు, షూ, టై, డైరీ తదితర రూపాల్లో తల్లిదండ్రుల నుంచి డబ్బులు పిండుకుంటున్నాయి. వాస్తవంగా ఇవన్నీ పాఠశాలల్లో కొనుగోలు చేయాల్సిన నిబంధన ఎక్కడా లేదు. అయినా యాజమాన్యాలు స్కూళ్లలో ఏకంగా వీటికోసం కౌంటర్లు తెరిచి అమ్ముతుండడం గమనార్హం. తమ స్థాయికి తగ్గట్లుగా డబ్బులు తీసుకుంటున్నారు. రెండు జతల యూనిఫాంలకు రూ. 2000 నుంచి 3,000, టై కి రూ. 200, షూ కి రూ. 500 - 1,000, డైరీకి దాదాపు రూ.300 లాగుతున్నారు. పాఠ్య పుస్తకాలు బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకు లభిస్తున్నా.. బలవంతంగా విద్యార్థి చదివే స్కూల్‌లోనే తీసుకోవాలని తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. ఎల్‌కేజీ బుక్స్‌కి రూ. 3,500 - రూ. 4,000 వసూలు చేస్తుండడం దోపిడీకి నిదర్శనం. ఇదే బుక్స్ బయట రూ. 1,800 కే అందుబాటులో ఉన్నాయి. ఇక 150 రూపాయలకే లభించే షూస్‌ను మూడింతల అధిక ధరకు అంటగడుతున్నారు. స్కూళ్లలో సామగ్రి అమ్మడం జీఓ నం 91కి విరుద్ధం. ఒకవేళ యాజమాన్యాలు విక్రయించాలనుకుంటే.. సదరు స్కూల్‌కు సంబంధించిన అభ్యసన సామగ్రి తదితరాలు లభ్యమయ్యే రెండు షాపులను ప్రత్యామ్నాయంగా చూపాలి. ఎక్కడ తక్కువ ధర ఉంటే అక్కడ తల్లిదండ్రులు కొనుగోలు చేస్తారు. అయితే ఈ నిబంధన ఎక్కడా అమలు కావడం లేదు.

 
తిండిలోనూ దండుకోవడం...

స్నాక్స్, భోజనం అందించడంలోనూ ఒక్కో స్కూల్‌లో ఒక్కో రేటు ఉంది. గచ్చిబౌలిలోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్‌లో రెండో తరగతి విద్యార్థికి మధ్యాహ్నం భోజనం అందిస్తున్నందుకు రూ. 20 వేలు వసూలు చేస్తున్నారు. అలాగే స్నాక్స్ సమకూర్చుతున్నందుకు రోజుకు రూ. 150 - రూ. 200 పిండుకుంటున్న స్కూళ్లూ ఉన్నాయి. మరికొన్ని బడులు స్నాక్స్‌కుగాను ఏడాదికి ఒకేసారి రూ. 18 వేల వరకు ధర నిర్ణయించారు. స్నాక్స్, భోజనం రెండూ కావాలంటే కనీసం ఏడాదికి రూ. 30 వేలు చెల్లించాల్సిందే.

 

 రోడ్డెక్కిన తల్లిదండ్రులు
ప్రైవేట్ స్కూళ్ల పలు రకాల దోపిడీలపై తల్లిదండ్రులు కన్నెర్ర చేస్తున్నారు. ఈమేరకు నగరంలో వీరంతా పేరెంట్స్ జేఏసీగా ఏర్పడి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ ఆందోళనలకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది.  శనివారం ఇందిరాపార్కు వద్ద పేరెంట్స్ జాయింట్ యాక్షన్ కమిటీ మహాధర్నా నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరచి ప్రైవేట్ పాఠశాలల దోపిడీకి అడ్డుకట్ట వేస్తే మంచిది.

 

 

బాదుడు ‘ఎక్స్‌ట్రా’...
ఎక్స్‌ట్రా యాక్టివిటీల కింద క్రీడలు, ఆటల పేరిటా బాదుతున్నారు. వాస్తవంగా బడ్జెట్ స్కూళ్ల నుంచి మొదలుకుంటే.. ఇంటర్నేషనల్ స్కూళ్ల వరకు క్రీడా మైదానాలు ఉన్నవి చాలా తక్కువ. ముఖ్యంగా నగరంలో 90 స్కూళ్లకు క్రీడా మైదానాలే లేవు. ఇటువంటి పరిస్థితుల్లో కేవలం తరగతి గదులకే పరిమితమయ్యే ఆటలు ఆడిస్తున్నా.. వాటికీ అదనంగా వసూలు చేస్తున్నారు. అలాగే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ముసుగులోనూ ఫీజులు తీసుకుంటున్నారు. ట్యాబ్, కంప్యూటర్, ఇంటర్నెట్ వినియోగం.. ఇలా తదితర వాటిపేర్లతో ఫీజుల బాంబు పేల్చుతున్నారు. కార్పొరేట్‌తోపాటు పేరొందిన స్కూళ్లలో ఏడాదికి రూ. 15 వేల నుంచి రూ. 25 వేలు వసూలు చేస్తున్నారు. ఈ పంథా ఇటీవలి కాలంలో బడ్జెట్ బడుల్లోనూ మొదలైంది. ఈ పాఠశాలల్లో హీనపక్షం రూ. 3 వేలు ఉంది. అలాగే వెల్‌కం పార్టీలు, ఫెయిర్ వెల్ పార్టీల పేరిటా విద్యార్థులకు బాదుడు తప్పడం లేదు. ఎటువంటి సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్నా.. కాస్టూమ్స్ భారం విద్యార్థి మీద పడక తప్పదు. ఇదీ పార్టీ పేరిట యాజమాన్యం నిర్ణయించిన మేరకు ఒక్కో విద్యార్థి విధిగా చెల్లించాల్సిందే. మొత్తం మీద ఏ కార్యక్రమం చేపట్టినా... ఆ భారం బుడతలపైనే.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement