సర్వ శిక్షా అభియాన్ పీవో వ్యవస్థ రద్దు!
* డీఈవోల అధీనంలో ఎస్‌ఎస్‌ఏ కార్యకలాపాలు నిర్వహణ
* కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో విద్యాశాఖ పునర్‌వ్యవస్థీకరణపై దృష్టి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని సర్వశిక్షా అభియాన్‌లోని(ఎస్‌ఎస్‌ఏ) ప్రాజెక్టు ఆఫీసర్(పీవో) వ్యవస్థను రద్దు చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. జిల్లా విద్యా శాకాధికారి(డీఈవో) నేతృత్వంలోనే ఎస్‌ఎస్‌ఏ కార్యకలాపాలను నిర్వహించాలని భావిస్తోం ది. ఇందుకోసం డీఈవో కింద అసిస్టెంట్ డెరైక్టర్ కేడర్‌లో ఓ అధికారిని నియమించాలని యోచిస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో విద్యాశాఖ పునర్‌వ్యస్థీకరణ, విద్యా కార్యకలాపాల నిర్వహణపై దృష్టి సారించింది.
దీనిపై పాఠశాల విద్యా డెరైక్టర్ కిషన్ ఆ శాఖ సీనియర్ అధికారులు, అదనపు డెరైక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. త్వరలోనే ప్రభుత్వానికి నివేదికను అందజేయనున్నారు. రాష్ట్రంలోని 634 కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాలు(కేజీబీవీ), మోడల్ స్కూళ్లు, విద్యాశాఖ గురుకులాల నిర్వహణకు డీఈవో అధీనంలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం కేజీబీవీల్లో రాష్ట్రస్థాయిలో 10 మంది గర్ల్ చైల్డ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (జీసీడీవీ), మోడల్ స్కూళ్లలో 9 మంది జీసీడీవోలు, గురుకులాల్లో 3 అకడమిక్ గెడైన్స్ అధికారులు ఉన్నారు.
వారందరిని జిల్లాలకు పంపించాలని, రాష్ట్రస్థాయి కార్యాలయంలో కార్యకలాపాలను ఆన్‌లైన్ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల శిక్షణను జిల్లా విద్యాశిక్షణ సంస్థలకు(డైట్) అప్పగించనున్నారు. ప్రభుత్వ పరీక్షల విభాగం పనులను కూడా డీఈవోల నేతృత్వంలో కొనసాగించేలా చర్యలు చేపడుతున్నారు. రాష్ట్రంలోని 391 కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాల్లో వారానికి ఐదుకు బదులు ఆరు కోడి గుడ్లను విద్యార్థులకు అందించాలని నిర్ణయించారు.
త్వరలో స్కౌట్స్ అండ్ గైడ్స్
కేజీబీవీల్లో 7, 8, 9 తరగతుల్లో త్వరలోనే స్కౌట్స్ అండ్ గైడ్స్‌ను ప్రవేశ పెట్టాలని విద్యాశాఖ నిర్ణయించింది. ప్రతి పాఠశాలలో 30 మంది విద్యార్థులతో ఈ యూనిట్లను ఏర్పాటు చేయనుంది. మోడల్ స్కూళ్లలోని 11, 12వ తరగతి విద్యార్థులకు ఎన్‌సీసీని ప్రారంభించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది.