సంస్కరణలతో రూ.855 కోట్లు ఆదా
పౌర సరఫరాల కమిషనర్ సీవీ ఆనంద్
సాక్షి, హైదరాబాద్: పౌర సరఫరాల శాఖ, సంస్థల్లో చేపట్టిన సంస్కరణల వల్ల రూ.855 కోట్లు ఆదా చేయగలిగామని పౌర సరఫరాల కమిషనర్ సీవీ ఆనంద్ చెప్పారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అమలు చేస్తున్న ఈ–పాస్ విధానాన్ని మరిన్ని జిల్లాలకు విస్తరించనున్నామని.. దానివల్ల ఏడాది కాలంలో మరో రూ.800 కోట్లు ఆదా అవుతాయని తెలిపారు. పౌర సరఫరాల శాఖతో పాటు పౌర సరఫరాల సంస్థ వైస్ చైర్మన్, ఎండీగా, లీగల్ మెట్రాలజీ కంట్రోలర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న సీవీ ఆనంద్ తాను బాధ్యతలు చేపట్టి ఐదు నెలలైన సందర్భంగా... మంగళవారం హైదరాబాద్‌లోని పౌర సరఫరాల భవన్‌లో విలేకరులతో మాట్లాడారు.
చిన్న జిల్లాల ఏర్పాటుతో ధాన్యం సేకరణ కేంద్రాలు, మిల్లులు, గోదాంలు, పాఠశాలలు, వసతి గృహాలు, రవాణా వంటి వాటి పర్యవేక్షణ స్థాయి మెరుగుపడిందన్నారు. రేషన్ బియ్యం దారి మళ్లింపు, రీసైక్లింగ్ చేస్తున్న వారిని గుర్తించడం, క్రిమినల్ కేసుల నమోదు, బ్లాక్ లిస్టులో పెట్టడం, 6ఎ కేసులకు సంబంధం ఉన్న వారికి ధాన్యం ఇవ్వకుండా నిలిపివేయడం వంటి చర్యలు తీసుకున్నామన్నారు. పీడీఎస్ బియ్యాన్ని రవాణా చేసే 1,150 వాహనాలకు జీపీఎస్ అమర్చినట్లు చెప్పారు.
2017లో పౌర సరఫరాల సంస్థ సామరŠాథ్యన్ని పెంచేందుకు మరో 5 విభాగాలను ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించామని ఆనంద్ తెలిపారు. ఐటీ విభాగం, ఎన్‌ఫోర్స్‌మెంట్–టాస్క్‌ఫోర్స్, ఆర్థిక నిర్వహణ–పర్యవేక్షణ విభాగం, సాంకేతిక విభాగం, ఇంజనీరింగ్ విభాగాలను సమకూర్చుకుంటామని.. వాటిని ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఏర్పాటు చేసుకుంటామని చెప్పారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ మినహా ఇతర అన్ని నియామకాలు, పరీక్షలు, ఇంటర్వూ్యలను సీజీజీ చూసుకుంటుందన్నారు.