సాక్షి, హైదరాబాద్
ఎస్సీ యువతకు ఉపాధి కల్పనలో భాగంగా ఆ కార్పొరేషన్ సరికొత్త ప్రణాళిక రూపొందించింది. ఇప్పటికే శిక్షణ, ఉద్యోగాల కల్పనపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్న ఆ శాఖ.. క్యాబ్‌ల ఏర్పాటుకు సన్నద్ధమవుతోంది. దీనికి ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలతో జతకడుతోంది. శిక్షణ పొంది, అనుభవం ఉన్న వారికి నేరుగా ఉపాధి కల్పించనుంది. ఈ మేరకు వాహనాలను కొనుగోలు చేసేందుకు కార్ల కంపెనీలతో మంతనాలు జరుపుతోంది. ఈ నెలాఖరులోగా ప్రక్రియను పూర్తి చేసి.. వచ్చే నెలలో లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు చర్యలు చేపట్టనుంది. 2017–18లో వెయ్యి యూనిట్ల గ్రౌండింగ్‌కు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది.
నిర్వహణకు ప్రాధాన్యత...
రెండేళ్ల క్రితం కార్ల పథకాన్ని అమలు చేసినప్పటికీ ఎస్సీ శాఖ నిర్వహణ లోపంతో విఫలం చెందింది. మెజారిటీ లబ్ధిదారులు వాటిని మధ్యలోనే అమ్మేసుకున్నారు. ఈ నేపథ్యంలో నిర్వహణకు ప్రాధాన్యతనిస్తూ ఎస్సీ కార్పొరేషన్ కార్యాచరణ రూపొందించింది. ఈ మేరకు మైక్రోసాఫ్ట్, కాగ్నిజెంట్ కంపెనీల్లో క్యాబ్‌ల నిర్వహణకు ఒప్పందం కుదుర్చుకోనుంది. అదేవిధంగా మెట్రోరైల్, ఓలా కంపెనీలతోనూ అవగాహన ఒప్పందం కుదుర్చుకోవాలని భావిస్తోంది. ఆయా కంపెనీలతో చర్చలు కూడా జరపడంతో, కార్పొరేషన్ తరుఫున క్యాబ్‌ల నిర్వహణకు కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి.
తొలి విడత ఒక్కో కంపెనీలో 250 కార్ల చొప్పున నాలుగు కంపెనీల్లో వెయ్యి కార్లకు అనుమతినివ్వాలని నిర్ణయించింది. నేరుగా కంపెనీతో అనుసంధానం కావడంతో బిల్లులకు ఎలాంటి ఇబ్బందులుండవని, ఉపాధికి హామీ ఉంటుందని కార్పొరేషన్ అధికారులు భావిస్తున్నారు. ఇది విజయం సాధిస్తే వచ్చే ఏడాది నుంచి ఈ పథకాన్ని భారీగా అమలు చేయనుంది. పెద్ద సంఖ్యలో వాహనాలు కొనుగోలు చేస్తున్నందున తక్కువ ధరకు తీసుకోవాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు టయోటా కంపెనీతో చర్యలు జరుపుతున్నారు. ఈనెలాఖరులోగా వాహనాల ధరలు ఖరారు చేసి, వచ్చే నెలలో లబ్ధిదారుల ఎంపిక నిర్వహించేలా అధికారులు చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించి త్వరలో మార్గదర్శకాలు వెలువడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment