సీపీఐ 90వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజల నుంచి విరాళాల సేకరణ కార్యక్రమాన్ని మఖ్దూం భవన్‌లో నారాయణ ప్రారంభించారు.
- బీజేపీ మతోన్మాదానికి వ్యతిరేకంగా పార్టీలు కదలాలి: నారాయణ
సాక్షి, హైదరాబాద్: దేశానికి ప్రమాదకరంగా మారిన సెన్సెక్స్‌ను తగలబెట్టాలని సీపీఐ జాతీయ నేత కె.నారాయణ అన్నారు. మంగళవారం మఖ్దూంభవన్‌లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, నేతలు అజీజ్‌పాషా, గుండా మల్లేష్, పల్లా వెంకటరెడ్డి, పశ్య పద్మతో కలసి మీడియాతో మాట్లాడారు. బిహార్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న క్రమంలో బీజేపీ గెలుస్తున్నట్లు ప్రచారం చేసుకుని కార్పొరేట్ కంపెనీలు షేర్లను అమ్ముకుని లాభపడ్డాయని చెప్పారు. ఈ ఫలితాల నేపధ్యంలో బీజేపీ మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా జాతీయ, ప్రాంతీయపార్టీలు ఐక్యంగా ముందుకెళ్లాలన్నారు. మోదీని ప్రసన్నం చేసుకునేందుకు ఆయన విధానాలకు ఏపీ సీఎం బాబు వంతపాడుతూ పులి మీద స్వారీ చేస్తున్నారన్నారు. పార్టీ 90వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వచ్చే నెల 26న దేశవ్యాప్తంగా రాజకీయ కార్యక్రమాలపై ప్రచారాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
1-25 వరకు బస్సుయాత్ర: సీపీఐ 90వ వార్షికోత్సవం సందర్భంగా డిసెంబర్ 1 నుంచి 25 వరకు రాష్ర్టంలో బస్సుయాత్ర, ప్రచార కార్యక్రమాలను చేపడుతున్నట్లు పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తెలిపారు. 26న నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో సాంస్కృతిక మేళా, 27న బహిరంగసభ ఉంటుందన్నారు. ఈ నెల 14న ‘బహుళత్వ పరిరక్షణ-శాస్త్రీయ అవగాహన-అసమ్మతి హక్కు’ అనే అంశంపై మఖ్దూం భవన్‌లో సభ నిర్వహిస్తున్నామన్నారు.