కట్నం వేధింపులతో భార్య బలవన్మరణానికి కారకుడైన భర్తకు న్యాయస్థానం ఏడేళ్ల జైలు శిక్ష విధించింది.
రంగారెడ్డి: కట్నం వేధింపులతో భార్య బలవన్మరణానికి కారకుడైన భర్తకు న్యాయస్థానం ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం... మీర్‌పేట్ త్రివేణి నగర్‌లో నివాసముండే దీపక్‌బాబు, సుచరిత దంపతుల వివాహం 2010 జూన్ నెలలో జరిగింది. కొంతకాలం వీరి కాపురం సజావుగానే సాగింది. వీరికి ఒక పాప కూడా ఉంది.
దీపక్‌బాబు మరింత కట్నం తేవాలంటూ సుచరితను శారీరకంగా, మానసికంగా వేధించాడు. ఈ క్రమంలో 2013 ఏప్రిల్ 24న దంపతుల మధ్య గొడవ జరిగింది. తీవ్ర మనస్తాపం చెందిన సుచరిత అదే రోజు రాత్రి ఇంట్లోనే ఊరేసుకుని మరణించింది. ఆమె తండ్రి ప్రకాష్ ఫిర్యాదు మేరకు మీర్‌పేట పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించి కోర్టులో అభియోగపత్రం నమోదు చేశారు. కేసు సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి గురువారం తీర్పునిచ్చారు. దీపక్‌బాబుకు ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.5 వేలు జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.