గుట్టుగా ‘ఈ’ లెర్నింగ్! | Shown 'this' learning! | Sakshi
Sakshi News home page

గుట్టుగా ‘ఈ’ లెర్నింగ్!

Published Fri, Jan 3 2014 4:04 AM | Last Updated on Sat, Sep 2 2017 2:13 AM

Shown 'this' learning!

=వాడీవేడిగా జేఎన్టీయూహెచ్ పాలకమండలి సమావేశం
 =అజెండాలో కనిపించని కీలకాంశాలు

 
సాక్షి, సిటీబ్యూరో: జేఎన్టీయూహెచ్ అభివృద్ధికి సంబంధించి కోట్లాది రూపాయలతో చేపడుతున్న ప్రాజెక్టుల్లో పారదర్శకత  లోపిస్తోంది. ఆయా పనులను వివిధ సంస్థలకు కట్టబెట్టే విషయాలపై యాజమాన్యం గుట్టుగా వ్యవహరిస్తుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. పాలకమండలి దృష్టికి తీసుకురాకుండానే సుమారు రూ.15 కోట్ల విలువైన ‘ఈ-లెర్నింగ్’ ప్రాజెక్టుకు సంబంధించి గ్లోబరీనా సంస్థతో ఎంవోయూ కుదుర్చుకునేందుకు ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేశారు. ఎంతో కీలకమైన ఈ ప్రాజెక్టు అంశాన్ని గురువారం జరిగిన యూనివర్సిటీ పాలకమండలి సమావేశపు అజెండాలో పొందు పరచకపోవడమే ఇందుకు నిదర్శనం.
 
గరంగరంగా సమావేశం..
 
వర్సిటీ ఉపకులపతి రామేశ్వర్‌రావు అధ్యక్షతన జరిగిన పాలకమండలి సమావేశంలో వర్సిటీ ఉద్యోగులకు సంబంధించిన అంశాలను ఆమోదించిన సభ్యులు మరికొన్ని అంశాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. గత సమావేశాల్లో ఆమోదించిన అంశాలకు సంబంధించి ఏటీఆర్ తప్పుల తడకగా ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే, అజెండాలో ముఖ్యమైన అంశాలను పెట్టకపోవడం వల్ల పాలకమండలి సభ్యుల్లో ఎక్కువమంది సమావేశానికి గైర్హాజరైనట్లు సమాచారం. యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న మంథని, జగిత్యాల ఇంజినీరింగ్ కళాశాలల్లో రూ.20 లక్షలతో లేబొరేటరి సామగ్రి కొనుగోలుకు, హైదరాబాద్ కళాశాలలో రూ.59 కోట్లతో విద్యార్థుల వసతిగృహాల నిర్మాణానికి పాలకమండలి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
 
షరతులతో పదోన్నతులకు అనుమతి
 
పదవీ విరమణకు దగ్గరలో ఉన్న కొంతమంది అధికారులకు షరతులతో కూడిన పదోన్నతులు (జేఆర్, డీఆర్) ఇచ్చేందుకు అనుమతించారు. మెడికల్ రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి కొత్తగా ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల అమలుకు కూడా పాలకమండలి ఆమోదం తెలిపింది. అనంతపురం, కాకినాడ జేఎన్టీయూలకు చెందిన ఆచార్యుల జీపీఎఫ్ నిధుల పంపిణీ, ఆయా యూనివర్సిటీలకు చెందిన మరికొందరు ఆచార్యుల డిప్యుటేషన్లను మరో ఆరు నెలల పొడిగింపు.. తదితర అంశాలకు ఆమోదం లభించింది. సమావేశంలో రిజిస్ట్రార్ రమణరావు, రెక్టార్ సాయిబాబారెడ్డి, సభ్యులు అన్నపూర్ణ, అహ్మద్‌కమల్, ఏపూరి అనిల్‌కుమార్, అజయ్‌మిశ్రా, గోవర్ధన్, విజయ్‌కుమార్‌రెడ్డి, టీకేకేరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement