పోలీసులకు డాటా సిమ్‌కార్డ్
► పతి నెలా ఫ్రీగా 1 జీబీ ఇంటర్నెట్, 100 రూపాయల టాక్ టైమ్
► ప్రతిపాదనలు ఆమోదించిన సీఎం కేసీఆర్
► దీపావళి కానుకగా త్వరలో పంపిణీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖలో క్షేత్ర స్థారుు సిబ్బందితో అధికారుల సమన్వయం మరింత పెరిగేందుకు రాష్ట్రంలోని పోలీసు సిబ్బంది అందరికీ ఇంటర్నెట్ సౌకర్యంతో కూడిన సిమ్ కార్డు అందజేయనున్నారు. దీపావళి పండుగ కానుకగా రాష్ట్రం లోని యాభై వేల పోలీసు సిబ్బందికి సీయూజీ సిమ్‌కార్డులను అందజేయనున్నారు. ఈ సీయూజీ ద్వారా ప్రతీ నెలా ఒక జీబీ ఇంటెర్నెట్, వంద రూపాయల ఉచిత ప్రీ పెయిడ్ టాక్ టైం సౌకర్యాన్ని కల్పించనున్నారు.
పోలీసు సిబ్బందిని ఒకే తాటిపైకి తీసుకురావాలన్న పోలీసు శాఖ ప్రతిపాదనలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆమోదం తెలిపారని డీజీపీ అనురాగ్ శర్మ శనివారం ఓ ప్రకనటలో తెలిపారు. ఇందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. పోలీసు వ్యవస్థను ఆధునీకరించడానికి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పోలీసు సిబ్బంది చక్కటి పనితీరు కనపరుస్తూ శాంతి భధ్రతల నిర్వహణలో విశేష కృషి చేస్తున్నారని డీజీపీ కొనియాడారు. ఇంటర్నెట్ సౌకర్యంతో కమ్యూనికేషన్ వ్యవస్థ మెరుగై మరింతగా ఉత్తమ ఫలితాలను సాధించగలరని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, పోలీసు సిబ్బందికి డీజీపీ దీపావళి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు.