గ్రేటర్‌కు సింగూరు, మంజీరా నీళ్లు
వెంటనే విడుదల చేయాలని కేసీఆర్ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ తాగునీటి అవసరాలకు సింగూరు, మంజీరా జలాలను తరలించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. నాగార్జునసాగర్‌లో నీటి నిల్వలు అడుగంటిన నేపథ్యంలో హైదరాబాద్, నల్లగొండ జిల్లాలకు మంచి నీటి సరఫరా కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ మేరకు సమీక్ష జరిపారు.
సింగూరు, మంజీరా జలాశయాల నుంచి హైదరాబాద్‌కు నిత్యం 90 మిలియన్ గ్యాలన్ల నీటిని వదలాలని, నాగార్జున సాగర్ నుంచి అక్కంపల్లి ద్వారా ఉదయ సముద్రానికి వారం రోజులపాటు 90 మిలియన్ గ్యాలన్ల చొప్పున నీరు వదిలి నల్లగొండ జిల్లాకు తాగునీరివ్వాలని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, ఈఎన్‌సీ మురళీధర్ రావును ఆదేశించారు. మంగళవారం రాత్రి నుంచే నీటి విడుదల జరగాలని సూచించారు. కృష్ణా నదిలో ఈసారి ఆశించిన స్థాయిలో వరద రాలేదని, నాగార్జున సాగర్‌లో నీరు డెడ్ స్టోరేజీ కంటే తక్కువగా ఉందని, ఈ నీటిని జాగ్రత్తగా వాడుకోవాల్సిన అవసరముందని పేర్కొన్నారు. కృష్ణా నది నీళ్లపై ఆధారపడిన హైదరాబాద్, నల్లగొండ జిల్లాలకు మంచి నీటి సరఫరాకు ఇబ్బంది ఏర్పడే పరిస్థితి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం వెల్లడించారు.