రంగంలోకి సిట్
నయీమ్ కేసులపై దర్యాప్తునకు ప్రత్యేక బృందం
నార్త్‌జోన్ ఐజీ నాగిరెడ్డి నేతృత్వంలో 8 మంది అధికారులతో నియామకం
ఇప్పటివరకు నమోదైన 11 కేసులు సిట్‌కు బదిలీ
నయీమ్ డైరీలోని అంశాలపై లోతుగా ఆరా తీయనున్న బృందం
గ్యాంగ్‌స్టర్ ఎన్‌కౌంటర్ కేసు సైబరాబాద్ డీఎస్పీకి
హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఎన్‌కౌంటర్ తదనంతర పరిమాణాలపై నమోదైన కేసులను పకడ్బందీగా విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటైంది. నయీమ్ చీకటి సామ్రాజ్యాన్ని ఛేదించేందుకు డీజీపీ అనురాగ్‌శర్మ బుధవారం నార్త్‌జోన్ ఐజీ నాగిరెడ్డి నేతృత్వంలో 8 మంది సభ్యులతో సిట్‌ను ఏర్పాటు చేశారు. వీరిలో ఒకరు ఏఎస్పీ స్థాయి ర్యాంకు కలిగిన అధికారి కాగా మిగతా ఏడుగురు వివిధ ప్రాంతాలు, విభాగాల్లో పనిచేస్తున్న ఇన్‌స్పెక్టర్లు. నయీమ్ అక్రమాస్తులు, నేరప్రవృత్తి, వెలుగుచూస్తున్న ల్యాండ్ డాక్యుమెంట్లు, మారణాయుధాలు తదితర అంశాలపై సిట్ దృష్టి సారించింది. మరోవైపు నయీమ్ ఎన్‌కౌంటర్ కేసును సైబ రాబాద్ పరిధిలోని డీఎస్పీ ర్యాంకు కలిగిన ఒక అధికారికి అప్పగించారు. జాతీయ మానవహక్కుల కమిషన్ నియమాల ప్రకారం ఎన్‌కౌంటర్‌పై విచారణకు వేరే జిల్లాకు చెందిన డీఎస్పీ స్థాయి అధికారిని నియమించాలి. అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నారు.
తుపాకులు, తూటాలు ఎలా వచ్చాయి?
వివిధ కేసుల్లో ఇప్పటి వరకు అరెస్ట్ చేసిన వారితోపాటు అదుపులోకి తీసుకున్నవారి నుంచి భారీగా ఆయుధాలు లభ్యమవుతున్నాయి. వీరికి తుపాకులు, తూటాలు ఎక్కడ్నుంచి వచ్చాయి? ఎవరు సమకూర్చారు? అనే కోణంలో ఆరా తీయాలని సిట్ యోచిస్తోంది. అలాగే వారి వ్యక్తిగత ఖాతాల్లో పెద్దఎత్తున డబ్బు ఉన్నట్లు గుర్తించారు. ఎక్కడెక్కడి నుంచి నిధులు వచ్చాయనే దానిపైనా ఆరా తీస్తున్నారు. ఈ కేసుల్లో కీలకమైదిగా భావిస్తున్న నయీమ్ డైరీపైనా సిట్ దృష్టి సారించింది. డైరీలో పలువురు ఐపీఎస్ అధికారులు, ప్రజాప్రతినిధుల పేర్లు ప్రస్తావించినట్లు సమాచారం. శంషాబాద్ డీసీపీ స్వాధీనం చేసుకున్న నయీమ్ 2 డైరీలను సిట్ సభ్యులు అధ్యయనం చేస్తున్నారు. కాగా షాద్‌నగర్‌లోని మిలీ నియం టౌన్‌షిప్ కాలనీలో గ్యాంగ్‌స్టర్ నయీ మ్ నివాసం ఉన్న ఇంట్లో నాగిరెడ్డి సోదాలు నిర్వహించారు.
సిట్ టీమ్ సభ్యులు వీరే: సిట్‌కు నార్త్ జోన్ ఐజీ నాగిరెడ్డి నేతృత్వం వహించనున్నారు. బి.శ్రీనివాస్‌రెడ్డి (అడిషనల్ డీసీపీ క్రైమ్స్, సైబారాబాద్), శ్రీధర్(ఇన్‌స్పెక్టర్ బేగంబజార్, హైదరాబాద్), ఎస్.సుధాకర్(ఉప్పల్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్), షకీర్ హుస్సేన్ (వనపర్తి ఇన్‌స్పెక్టర్), రాజశేఖర్ రాజు(కోరుట్ల ఇన్‌స్పెక్టర్), సామల వెంకటేష్ (సీసీఎస్ సంగారెడ్డి ఇన్‌స్పెక్టర్), పి.మధుసూదన్‌రెడ్డి (కోదాడ ఇన్‌స్పెక్టర్), సీతారామ్(ఆర్మూరు ఇన్‌స్పెక్టర్) సిట్‌లో సభ్యులుగా ఉన్నారు.
కేసులన్నీ సిట్‌కు బదిలీ
రాష్ట్ర వ్యాప్తంగా నయీమ్ ఎన్‌కౌంటర్ తదనంతరం వివిధ ప్రాంతాల్లో 11 కేసులు నమోదయ్యాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో నార్సింగి, వనస్థలిపురంతోపాటు నల్లగొండ, భువనగిరి, మిర్యాలగూడ, నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలో నమోదైన కేసులను సిట్‌కు బదిలీ చేశారు. నయీమ్ అనుచరులుగా భావిస్తున్న దాదాపు 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో నయీమ్ ఇంట్లో వంట మనిషి ఫర్హాన్, నయీమ్ డ్రైవర్ భార్య ఆసియా, ముఖ్య అనుచరులు శ్రీధర్‌గౌడ్, రియాజుద్దీన్, ఫయీమ్ తదితరులను అరెస్టు చేశారు. వీరి నుంచి నయీమ్ అక్రమాలకు సంబంధించి పోలీసులు కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు వెలుగు చూసిన సమాచారం ఆధారంగా దర్యాప్తును మరింత పకడ్బందీగా చేసేందుకు సిట్ కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో పలు జిల్లాలో వందల ఎకరాల భూములు, ప్లాట్లు, నివాస సముదాయాలు ఉన్నందున రిజిస్ట్రేషన్ల శాఖ అధికారుల సాయంతో అధ్యయనం చేయాలని నిర్ణయించారు.