
దొంగోడిని పట్టించిన ‘భార్య’?
ఎన్‌ఆర్‌ఐ శివప్రసాద్ రెడ్డి ఫ్లాట్‌లో దొంగతనం చేసింది పక్కింటి కారుడ్రైవరే
భార్య ఆ ఆభరణాలు ధరించడంతో కొలిక్కివచ్చిన కేసు
మూడు కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలు స్వాధీనం
హైదరాబాద్ : తన భర్త కొట్టేసుకొని వచ్చిన ఆభరణాలను ఆ భార్య ధరించడంతో పోలీసులకు ఓ ప్రబుద్ధుడు చిక్కిన ఘటన కొండాపూర్‌లోని సైబర్ మెడోస్ విల్లాస్‌లో చోటుచేసుకుంది. దీంతో రెండేళ్ల క్రితం నాటి భారీ చోరీ కేసును కూకట్‌పల్లి సీసీఎస్ పోలీసులు ఛేదిం చారు. దొంగ అయిన కారు డ్రైవర్ మహేష్‌ని అదుపులోకి తీసుకున్న పోలీసులు దాదాపు మూడు కోట్ల విలువ చేసే డైమండ్, నెక్లెస్ ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది.
విశ్వసనీయ సమాచారం మేరకు... కొండాపూర్‌లోని సైబర్ మెడోస్ విల్లాస్‌లో ఎన్‌ఆర్‌ఐ శివప్రసాద్ రెడ్డి ఉంటున్నాడు. అయితే అతని పక్కా విల్లాలోనే కారు డ్రైవర్‌గా మహేష్ పనిచేస్తున్నాడు. ఇదే సమయంలో శివప్రసాద్ రెడ్డి వద్ద పని చేసే డ్రైవర్‌తో పాటు మహేష్ చనువుగా ఉండేవాడు. ఒకసారి మద్యం తాగిన మైకంలో మహేష్‌తో శివప్రసాద్‌రెడ్డి డ్రైవర్ అతని యజవూని ఇంట్లో ఉండే విలువైనసామగ్రి గురించి చెప్పాడు. ఇది తెలుసుకున్న మహేష్ దొంగతనం చేసేందుకు పక్కా స్కెచ్ వేశాడు.
2014లో శివప్రసాద్ రెడ్డి విదేశాలకు వెళ్లిన సమయంలో అతని ఫ్లాట్‌లోకి వెళ్లి ఏకంగా డైమండ్, బంగారు నగలు ఉన్న లాకర్‌ని ఎత్తుకొని వెళ్లాడు. ఇందులో 60 లక్షల విలువ చేసే నాలుగు డైమండ్ నెక్లెస్‌లు, ఆరు బంగారు బిస్కెట్లు ఉన్నాయి. వీటిలో నాలుగు బంగారు బిస్కెట్లు అమ్మిన మహేశ్వర్ రెడ్డి...భారీ విలువైన డైమండ్ నెక్లెస్‌లు ఎలా అమ్మాలో తెలియలేదు.
అయితే ఇటీవల మహేష్ ఇంట్లో ఓ ఫంక్షన్ జరిగిన సమయంలో అతడి భార్య ఆ నగలు ధరించడంతో అనుమానం వచ్చిన కొందరు బంధువులు, స్థానికులు కూకట్‌పల్లి సీసీఎస్ పోలీసులకు సమాచారం అందించారు. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తే శివప్రసాద్ రెడ్డి ఇంట్లో దొంగతనం చేసిన నగలని ఒప్పుకున్నట్టు తెలుస్తోంది.