సాక్షి, విశాఖపట్నం / మధురవాడ / పీఎం పాలెం : మధురవాడ ఆదిత్య ఫార్చ్యూన్ అపార్టుమెంట్‌లో అగ్ని ప్రమాదంలో ఎన్‌ఆర్‌ఐ కుటుంబం మృతిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. తల్లిదండ్రులు, తమ్ముడి శరీరంపై గాయాలుండడంతో మానసిక స్థితి సరిగా లేని పెద్ద కుమారుడే హతమార్చి తనూ ఆత్మహత్యకు పాల్పడ్డాడా..? అన్న అనుమానాలు పోలీసులు ప్రాథమికంగా వ్యక్తం చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బహ్రెయిన్‌లో స్థిరపడిన విజయనగరం జిల్లా గంట్యాడ వాసి సుంకరి బంగారునాయుడు నాలుగేళ్ల కిందట నగరానికి విచ్చేశారు. మధురవాడ మిథిలాపురి ఉడాకాలనీలోని విలాసవంతమైన ఆదిత్య ఫార్చ్యూన్ అపార్ట్‌మెంట్ సి బ్లాకు, 505 ప్లాట్‌లో భార్య నిర్మల, ఇద్దరు కుమారులు దీపక్, కశ్యప్‌లతో కలిసి 8 నెలలు క్రితం అద్దెకు దిగారు. అక్కడికి సమీపంలోనే సుమారు కోటి రూపాయల విలువ చేసే భవనం నిర్మించుకుంటుండడంతో అక్కడ అద్దెకు దిగారని బంధువులు చెబుతున్నారు.
ఆ రాత్రి ఏం జరిగింది..?
బంగారునాయుడు నివసిస్తున్న ప్లాట్‌లో బుధవారం రాత్రి ఏం జరిగిందన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదు. సివిల్ ఇంజినీర్‌గా పనిచేసిన బంగారునాయుడు బహ్రెయిన్‌లో తెలుగు అసోసియేషన్ కార్యదర్శిగా గతంలో పనిచేశారు. 2007లో ఏయూ నుంచి డాక్టరేట్ తీసుకున్నారు. రఘు కళాశాలకు కన్సటెంట్‌గా పనిచేస్తున్నారు. అతని భార్య నిర్మల డాక్టర్‌గా పనిచేస్తున్నారు. దీపక్ ఢిల్లీ ఎన్‌ఐటీలో ఇంజినీరింగ్ పూర్తి సివిల్స్ పరీక్షల కోసం సిద్ధమవుతున్నాడు. చిన్నకుమారుడు కశ్యప్ ఇంటర్ చదువుతున్నాడు. అందరూ విద్యావంతులై అన్యోన్యంగా జీవిస్తున్న ఇంటిలో ఏం జరిగిందన్నది తెలియడం లేదు. చివరగా ఆ ఇంటిలోకి బుధవారం రాత్రి 8.55గంటలకు బంగారునాయుడు ప్రవేశించినట్లు సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా తెలిసింది. అనంతరం పెద్దగా గొడవ జరిగినట్లు పక్క ప్లాట్ల వారు చెబుతున్నారు.
అయితే కుటుంబ వ్యవహారం కావడంతో ఎవరూ జోక్యం చేసుకోలేదంటున్నారు. ఈ క్రమంలో గురువారం తెల్లవారి 3 గంటల సమయంలో ఒక్కసారిగా శబ్ధం వచ్చినట్లు సెక్యూటీ సిబ్బంది గ్రహించారు. నాలుగు గంటల సమయంలో ప్లాట్ నుంచి పొగ రావడంతో అపార్ట్‌మెంట్‌వాసులు భయాందోళనతో అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు ప్లాట్ వద్దకు చేరుకుని స్థానికుల సాయంతో తలుపులు బద్దలు గొట్టి చూసేసరికి బంగారునాయుడు తలుపును అనుకుని పడి ఉన్నాడు. మరికొద్ది దూరంలో భార్య నిర్మల మృతదేహం ఉంది. చిన్నకుమారుడు కశ్యప్ ఓ బెడ్ రూమ్‌లో... పెద్ద కుమారుడు దీపక్ బాత్‌రూమ్‌లో అచేతనంగా పడి ఉన్నారు.
దీపక్ మానకసిక స్థితి బాగోలేకే
గురువారం ఉదయం సంఘటన స్థలికి చేరుకున్న నగర పోలీసు కమిషనర్ మనీష్‌కుమార్ సిన్హా మీడియాతో మాట్లాడుతూ బంగారునాయుడు, అతని భార్య నిర్మల, చిన్నకుమారుడు కశ్యప్ మృతదేహాలపై గాయాలుండడంతో వారి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోందన్నారు. మానసిక స్థితి సరిగా లేకపోవడంతో ముగ్గురినీ దీపక్ హతమార్చి ఉంటాడని అనుమానిస్తున్నామన్నారు. పరిసర ప్లాట్‌ల వారితో మాట్లాడాక అన్ని కోణాల్లో విచారిస్తున్నామని తెలిపారు.
5వ అంతస్తులో ఒకే సీసీ కెమెరా ఉందని, అక్కడి ఫుటేజీ క్షుణ్ణంగా పరిశీలించాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ప్రమాదవశాత్తు జరిగిందా? లేదంటే వారే ఆత్మహత్య చేసుకున్నారా? ఎవరైనా హత్య చేశారా? అని విచారణ చేస్తున్నట్లు సీపీ మనీష్‌కుమార్ సిన్హా వెల్లడించారు. మరోవైపు బంగారునాయుడు కుటుంబంలో వివాదాలు, మనస్పర్థలు లేవని కాలనీవాసులు చెబుతున్నారు. దీపక్ మానసిక స్థితి అంతా సక్రమంగా ఉందని, సివిల్స్‌కు సిద్ధమవుతున్నాడని, బంధువులు చెబుతున్నారు. దీపక్ మానసిక స్థితిని అనుమానించాల్సిన పని లేదని, పక్కా ప్రణాళిక ప్రకారం ఎవరో హత్య చేశారని... ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు చేయాలని బంధువులు కోరుతున్నారు.
ప్రమాదం నుంచి బయటపడేందుకు యత్నించాడా..?
బంగారునాయుడు, నిర్మల, కశ్యప్ మృతదేహాలపై గాయాలున్నప్పటికీ దీపక్ శరీరంపై గాయాలేవీ లేవు. మానసిక సమస్యతో బాధపడుతున్న దీపక్... క్షణికావేశంలో తల్లిదండ్రులు, తమ్ముడిని హతమార్చి... తాను కూడా ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు సంఘటన జరిగిన తీరు పరిశీలిస్తే... బాత్‌రూమ్‌లో కుళాయి విప్పి ఉండడం... అక్కడే దీపక్ పడి ఉండడంతో... ముగ్గురినీ హతమార్చాక ప్రమాదంగా చిత్రీకరించి తాను అక్కడి నుంచి తప్పించుకునే క్రమంలో అగ్నికి ఆహుతైపోగా... ఆ ప్రమాదం నుంచి బయటపడేందుకు బాత్రూమ్‌లోకి ఏమైనా వెళ్లాడా..? అని అనుమానిస్తున్నారు.
చదవండి: మధురవాడలో మరణ మృదంగం
Comments
Please login to add a commentAdd a comment