![Madhurawada Visakhapatnam NRI Family Case Probe Continues - Sakshi](/styles/webp/s3/article_images/2021/04/17/vsp1.jpg.webp?itok=yXlZuOoB)
సాక్షి, విశాఖపట్నం/మధురవాడ/పీఎంపాలెం: మధురవాడ మిథిలాపురి వుడా కాలనీలో ఎన్నారై కుటుంబం అనుమానాస్పదమృతి మిస్టరీ కొనసాగుతోంది. సంఘటన స్థలాన్ని పోలీసులు అణువణువూ పరిశీలిస్తున్నారు. ఏసీపీ కుమార స్వామి నేతృత్వంలో పీఎంపాలెం సీఐ రవికుమార్ దర్యాప్తు చేస్తున్నారు. శుక్రవారం కేజీహెచ్‌లో పోస్టుమార్టం అనంతరం నాలుగు మృతదేహాలను సొంతగ్రామమైన విజయనగరం జిల్లా గంట్యాడకు తరలించారు. కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. గంట్యాడలో బంగారునాయుడు కుటుంబం రాజకీయంగా, ఆర్థికంగా స్థిరపడింది. ఆయనకు విజయనగరం, విశాఖ జిల్లాలో పలు చోట్ల భూములు, స్థలాలు ఉన్నాయి. విశాఖపట్నం, హైదరాబాదులో విలువైన స్థిరాస్తులు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ఆస్తుల పరమైన వివాదాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. బంగారునాయుడు బెహరెయిన్‌లో ఉద్యోగంతోపాటు పెట్రో సంబంధ వ్యాపారాలు చేసేవారు. వ్యాపార పరమైన తగాదాలు ఉండవచ్చునని బంధువుల నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొడుకే తల్లిదండ్రులను హత్యచేసి ఉండవచ్చునని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఉండకపోవచ్చునని వారు భావిస్తున్నారు. హత్యాకోణంలో పోలీసులు దర్యాప్తు జరపాలని వారు కోరుతున్నారు. బంగారునాయుడు కుటుంబం ఉంటున్నది ‘సి’ బ్లాక్ కావడంతో బయట వ్యక్తులు ప్రవేశించేందుకు అవకాశం ఉందని వారు చెబుతున్నారు.
హత్య కోణంలో దర్యాప్తు చేయాలి
మధురవాడ (భీమిలి) : ఢిల్లీ ఎన్‌ఐటీలో ఇంజనీరింగ్ చేసి సివిల్స్‌కి ప్రిపేర్ అవుతున్న దీపక్ మెరిట్ స్టూడెంట్ అని, మానసిక రోగిగా ముద్ర వెయ్యడం సరికాదని మృతి చెందిన బంగారునాయుడు ఆఖరి సోదరుడు చిన అప్పలనాయుడు పేర్కొన్నారు. తన అన్నయ్య కుటుంబాన్ని ఎవరో హత్య చేసి ఉంటారని, ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు చేయమని నగర పోలీసు కమిషనర్ మనీష్‌కుమార్ సిన్హాను కోరతామని చినఅప్పలనాయుడు ‘సాక్షి’కి చెప్పారు. తమది బాగా స్థిరపడిన కుటుంబమని, తమ తండ్రి శ్రీరాములు నాయుడు డీసీఎంస్ ప్రెసిడెంట్‌గా 15ఏళ్లు పనిచేశారన్నారు. ‘‘మా సోదరుడు కూడా బాగా స్ధిపడిన వ్యక్తి. మా వదిన డాక్టర్ ఆవిడ పెంపకంలో పెరిగిన వ్యక్తి దీపక్... అతనికి ఏ రకమైన మానసిక ఇబ్బందులు లేవన్నారు. నా సోదరుడు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కాబట్టి ఆయన ల్యాప్‌టాప్ కోసం వెతుకుతున్నాం. మృతి చెందినవారి శరీరంపై కత్తి గాట్లు ఉన్నాయని, వీటిని చూస్తే ప్రొఫెషనల్ కిల్లర్స్ ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు అనుమానం కలుగుతోంది’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment