
సెల్‌ఫోన్‌కు వడగాడ్పుల సమాచారం
ఉష్ణోగ్రత 45 డిగ్రీలకు మించిన ప్రాంతాల్లో మొబైల్స్‌కు ఎస్సెమ్మెస్
సాక్షి, హైదరాబాద్: వడగాడ్పులపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వడగాడ్పుల బారిన పడకుండా ప్రజలను ముంద స్తుగా అప్రమత్తం చేసేందుకు ఐటీ శాఖ తెలంగాణ రాష్ట్ర ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ నియంత్రణ పోర్టల్‌ను రూపొందిం చింది. దీని ద్వారా ఎండవేడిమి అధికంగా ఉన్న ప్రాంతాల్లోని ప్రజల మొబైల్ ఫోన్లకు 15 రోజుల ముందుగానే ఎస్సెమ్మెస్ రూపంలో సమాచారం అందించనుంది. వాతావరణ శాఖ సహకారంతో ఐటీ అధికారులు రూపొందించిన వెబ్‌పోర్టల్‌ను ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ సోమవారం సచివాలయంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున ప్రాణనష్టం జరగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చామన్నారు. ముందస్తు సమాచారమిచ్చి ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఐటీ శాఖ రూపొందించిన వెబ్‌పోర్టల్ ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రాంతాలవారీగా ఉష్ణోగ్రతల వివరాలను సేకరించేం దుకు రాష్ట్రాన్ని 855 భాగాలుగా విభజించామని, ఆయా ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన సెన్సార్లతో ఉష్ణోగ్రతల సమాచారాన్ని వాతావరణ శాఖ ద్వారా సేకరించనున్నట్లు ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు. రాబోయే 15 రోజుల్లో ఉష్ణోగ్రతలపై ముంద స్తు అంచనాను వెబ్‌పోర్టల్‌లో ఉంచుతామన్నారు. ఉష్ణోగ్రత 40 నుంచి 45 డిగ్రీలు ఉంటే వడగాల్పులుగా పరిగణిస్తామని, అంతకుమించిన ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశమున్నట్లైతే సీవియర్ హీట్‌వేవ్‌గా పరిగణిస్తామన్నారు. ఏ ప్రాంతంలోనైతే 45 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందో ఆ సమాచారాన్ని ఆ ప్రాంతంలోని ప్రజల మొబైల్స్‌కు ఎస్సెమ్మెస్ రూపంలో చేరవేస్తామన్నారు.