టెక్నాలజీతో ఎదుర్కొన్నాం
⇒హుద్‌హుద్ తుపానుపై శాసన సభలో చర్చకు సీఎం చంద్రబాబు సమాధానం
⇒బాధితులను ఆదుకుంటుంటే.. ప్రతిపక్షం వాస్తవాలు జీర్ణించుకోలేక విమర్శిస్తోంది
సాక్షి, హైదరాబాద్: టెక్నాలజీని బాగా వినియోగించుకోవడం, అధికారులతో బాగా పనిచేయించడం వల్ల హుద్‌హుద్ తుపాను కలిగించిన కష్టాల నుంచి ప్రజలను త్వరగా రక్షించగలిగామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. హుద్‌హుద్ నష్టం మీద శాసన సభలో రెండు రోజుల పాటు జరిగిన చర్చకు శనివారం ఆయన తుది సమాధానమిచ్చారు. దేశంలో ఎక్కడ ఇబ్బంది, విపత్తు వచ్చినా వెళ్లి ఆదుకున్న చరిత్ర తనకు ఉందని, అదే విధంగా హుద్‌హుద్ బాధితులను ఆదుకున్నామని వివరించారు.
ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఉత్తరాఖండ్‌లో విపత్తు సంభవిస్తే.. బాధితులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలయమ్యాయని, ప్రతిపక్ష నేతగా తాను విమానాల్లో బాధితులను తరలించానని చెప్పారు. ఒడిశాలో పెను తుపాను వచ్చినప్పుడు కూడా తాను రంగంలోకి దిగానని, అక్కడి సీఎంకు శాటిలైట్ ఫోన్ కూడా తానే ఇచ్చానని చెప్పారు. హుద్‌హుద్ తుపాను తీవ్రతను వాతావరణ కేంద్రం ముందుగానే చెప్పడంతో, అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని చెప్పారు. అత్యంత కష్టమైనప్పటికీ, రోడ్డు మార్గంలో రాజమండ్రికి, అక్కడి నుంచి విశాఖపట్నానికి వెళ్లి, రేయింబవళ్లు కష్టపడి పరిస్థితిని సాధారణ స్థితికి తెచ్చానన్నారు.
అధికారులు, ప్రజా ప్రతినిధులు మనుసుపెట్టి పనిచేశారని చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వాలూ ఇవ్వని విధంగా ప్యాకేజీలు ఇచ్చామని తెలిపారు. 50 కిలోల బియ్యం, పప్పు, ఉప్పు, కారం, కూరగాయలు బాధితులకు అందించడం దేశంలోనే తొలిసారని అన్నారు. ఎవరికెంత పరిహారం వస్తుందో గ్రామాల్లో జాబితాలు విడుదల చేశామని, రాని పక్షంలో అడిగి తీసుకోవాలని చెప్పామన్నారు.
రూ. 844 కోట్లే ఖర్చు చేశామని విపక్షం విమర్శిస్తోందని, విద్యుత్ శాఖ చేసిన ఖర్చు, పరిశ్రమలకు ఇచ్చిన రాయితీలు, పౌల్ట్రీ, ఫిషరీస్‌కు ఇచ్చిన మొత్తాన్ని అందులో చూపించలేదని వివరించారు. కేంద్రం వెంటనే స్పందించడమే కాకుండా, ప్రపంచబ్యాంకు, ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ కూడా రూ.10 వేల కోట్ల నుంచి రూ. 12 వేల కోట్ల రుణం ఇవ్వడానికి ముందుకొచ్చాయని చెప్పారు. ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనల వల్ల రుణం తీసుకోలేదన్నారు. బాధితులను అన్ని విధాలా ఆదుకుం టుంటే.. ప్రతిపక్షం వాస్తవాలు జీర్ణించుకోలేక విమర్శిస్తోందన్నారు.
బాబు నిధులు తెస్తారు: హోం మంత్రి
దమ్మిడీ ఖర్చు చేయలేదని ప్రతిపక్ష నేత చేస్తున్న విమర్శల్లో వాస్తవం లేదని హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. ముఖ్యమంత్రి మాట్లాడటానికి ముందే చర్చకు ఆయన సమాధానమిచ్చారు. పునరావాసం, తాత్కాలిక మరమ్మతులకు ప్రభుత్వం రూ. 844 కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. ఆపద సమయంలో ఏమిచ్చినా బంగారమేనని ప్రజలు భావించారని అన్నారు. తుపాను నష్టాలను,సాయాన్ని లెక్కలతో వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం రూ. 1,000 కోట్లు సహాయంగా ప్రకటించి, రూ. 400 కోట్లు విడుదల చేసిందనీ మిగతా నిధులను కూడా కేంద్రం నుంచి తెచ్చి విశాఖ పునర్నిర్మాణాన్ని చంద్రబాబు పూర్తి చేస్తారని చెప్పారు.