'ఆ అధికారం స్పీకర్‌కు ఉండదు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలపై శనివారం హైకోర్టు సీనియర్ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ మాట్లాడారు. అసెంబ్లీలో సభ్యుడిని సస్పెండ్ చేసే అధికారం స్పీకర్‌కు ఉండదన్నారు. ఒక సెషన్ కంటే ఎక్కువ సస్పెండ్ చేయాలంటే మొదట ఫిర్యాదు చేయాలని, ఆ తరువాత ఎథిక్స్, ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదును పంపాలని చెప్పారు. టీడీపీ నేత కరణం బలరాం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యురాలు ఆర్‌కే రోజా అంశాలు రెండు వేర్వేరు అని ఆయన అభిప్రాయపడ్డారు.
కరణం బలరాం వ్యవహారంలో ప్రివిలేజ్ కమిటీ విచారించాకే 6 నెలలపాటు సస్పెండ్ చేసినట్టు రవిశంకర్ గుర్తు చేశారు. టీడీపీ నిర్ణయం.. సభ మొత్తం నిర్ణయం కాదని ఆయన స్పష్టం చేశారు. కాగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని స్పీకర్ కోడెల శివప్రసాదరావు మూజువాణి ఓటుతో ఎమ్మెల్యే రోజాను శాసనసభ నుంచి ఏడాది పాటు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.