‘తెలుపే’ సెన్సేషన్!
హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి డ్యాన్స్ ఈవెంట్
* గచ్చిబౌలి స్టేడియంలో నేడు ‘వైట్ సెన్సేషన్’
* ఎటు చూసినా కేవలం ‘తెలుపు’ వర్ణమే
సాక్షి, హైదరాబాద్: ఎటు చూసినా తెల్లని తెలుపు. కళ్లు జిగేల్‌మనిపించే లైటింగ్. అబ్బురపరిచే సెట్టింగులు. వీటన్నింటికీ మించి అదిరిపోయే సంగీత, నృత్య ప్రదర్శనలు... ఇదంతా ‘వైట్ సెన్సేషన్’. ప్రపంచంలోనే పేరెన్నికగన్న ఈ డ్యాన్స్ ఈవెంట్ శనివారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియం వేదికగా ఉర్రూతలూగించనుంది. ఈ సెన్సేషన్ గురించిన కొన్ని విశేషాలు...
నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్‌లో ‘వైట్ సెన్సేషన్’ ఊపిరిపోసుకుంది. ఇప్పుడు దాదా పు 33 దేశాలకు విస్తరించింది. ఆసియా ఖం డంలోనే తొలిసారిగా ఇప్పుడు భారతదేశంలో అడుగుపెట్టింది. బెంగుళూరు, ముంబై, ఢిల్లీ వంటి నగరాలు పోటీపడినా ఈ ఈవెంట్‌ను హైదరాబాద్ దక్కించుకుంది. ఈ ఈవెంట్‌కు దాదాపు 20 వేల మంది హాజరవుతారని భావి స్తున్నట్లు హైదరాబాద్‌లో దీన్ని నిర్వహిస్తున్న వయోలా ఈవెంట్స్ నిర్వాహకుడు విజయ్ అమృత్‌రాజ్ చెప్పారు. మరో నాలుగేళ్ల పాటు దీన్ని ఏటా ఫిబ్రవరిలో నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ వేడుకతో గచ్చిబౌలి స్టేడియం మొత్తం డ్యాన్స్‌ఫ్లోర్‌గా మారిపోతుందని అభివర్ణించారు. అధికారికంగా నిర్వాహకులు వెల్లడించనప్పటికీ ఈ ఈవెంట్‌కు కనీసం రూ.10 కోట్లు వ్యయం అవుతుందని అంచనా.
ఊగే వేదిక... ఉత్తేజమే కానుక
ఈవెంట్‌కు అవసరమైన పరికరాలను ఆమ్‌స్టర్‌డామ్ నుంచి 13 కంటెయినర్లలో హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. మొత్తం తమ పరికరాలే తప్ప స్థానికంగా లభించేవి ‘వైట్ సెన్సేషన్’ కోసం వినియోగించరు. దాదాపు 5 నెలల పాటు 30 మంది ఇంజనీర్లు శ్రమించి, షో డిజైనింగ్, వేదిక నిర్మాణం కోసం శ్రమించారు. ‘పైరో డిజైన్’లో రకరకాల పొగలు ఒకేసారి వెదజల్లేలా ఏర్పాట్లు చేశారు. 800కిపైగా ఎల్‌ఈడీ లైట్లు అమర్చారు. ఈవెంట్ వేదిక 360 డిగ్రీల కోణంలో సందర్శకుల మధ్యలో ఉంటుంది. ఇది నిమిషానికి మూడు సార్లు తిరుగుతూ ఉంటుంది. ఇందులో పాల్గొనే 20 మంది డ్యాన్సర్లు భారతీయులే. వారిని గత కొన్ని నెలలుగా పోటీ నిర్వహించి ఎంపిక చేశారు. ఇక ఇది పూర్తిగా శ్వేత లోకం. ఆర్టిస్ట్‌లు, డీజేలతో సహా అతిథులకు కూడా తెలుపురంగు డ్రెస్ కోడ్ తప్పనిసరి. ప్రపంచంలోనే మొత్తం శ్వేత వర్ణమయమై సాగే సంగీత, నృత్యోత్సవం ఇదొక్కటే.