2020కి స్టార్టప్‌లల్లో భాగ్యనగరం నం.1 | Startup of 2020 In the Bhagyanagaram No.1 | Sakshi
Sakshi News home page

2020కి స్టార్టప్‌లల్లో భాగ్యనగరం నం.1

Published Fri, Aug 26 2016 3:05 AM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM

Startup of 2020 In the Bhagyanagaram No.1

ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్‌రంజన్
హైదరాబాద్: స్టార్టప్‌లలో 2020 నాటికి దేశంలోనే హైదరాబాద్ నంబర్ వన్‌గా ఎదిగే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్‌లో టై, వాక్సెన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లు సంయుక్తంగా నిర్వహించనున్న స్టార్టప్ ఎక్సలెరేటర్ ప్రోగ్రామ్ బ్రోచర్‌ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం స్టార్టప్‌లలో బెంగళూర్, గుర్గావ్, ఢిల్లీ తర్వాత హైదరాబాద్ నాల్గో స్థానంలో ఉందన్నారు. ఇక్కడ అత్యాధునిక మౌలిక వసతులు కలిగిన టీహబ్‌లో యువ పారిశ్రామికవేత్తలకు అన్ని రకాల సేవలు అందిస్తున్నామని తెలిపారు.

ఐఎస్‌బీ, ట్రిపుల్ ఐటీ, నల్సార్ యూనివర్సిటీలు సహకారం అందిస్తున్నాయని చెప్పారు. టై, వాక్సెన్ స్కూల్‌లు ఇచ్చే శిక్షణ.. స్టార్టప్‌లలో యువ పారిశ్రామికవేత్తలు రాణించేందుకు ఎంతగానో తోడ్పతుందన్నారు. టై హైదరాబాద్ అధ్యక్షుడు సురేశ్ చల్లా మాట్లాడుతూ... ఇప్పటికే స్టార్టప్‌లు ప్రారంభించిన వారితో పాటు యువ పారిశ్రామికవేత్తలకు సెప్టెంబర్ 13-15 తేదీల్లో, 23-25 తేదీల్లో జహీరాబాద్‌లోని వాక్సెన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో శిక్షణ ఇస్తామని వెల్లడించారు. క్యాంపస్‌లోనే ఉండి శిక్షణ తీసుకోవాల్సి ఉంటుందని... మార్కెటింగ్, సేల్స్, ఫైనాన్స్, టీం బిల్డింగ్, గ్రోత్ మేనేజ్‌మెంట్, హెచ్‌ఆర్‌లలో శిక్షణ ఇస్తామని తెలిపారు.

స్టార్టప్‌లు నెలకొల్పేవారికి ఈ శిక్షణ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ప్రతి నెలలో మొదటి శుక్రవారం టీ-హబ్‌లోనూ శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. పారిశ్రామికవేత్తల అనుభవాలను మేళవించి శిక్షణ ఇవ్వనున్నట్లు వాక్సెన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ డీన్ డాక్టర్ జేసీ వాండెమ్‌బర్గ్ పేర్కొన్నారు. ఐటీతో పాటు వివిధ రంగాలలో ఎదిగేందుకు భారతదేశంలో అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement