గెలుపు గుర్రాలకోసం అన్వేషణ | State BJP president Laxman comments on TRS Govt | Sakshi
Sakshi News home page

గెలుపు గుర్రాలకోసం అన్వేషణ

Published Fri, Jul 15 2016 1:10 AM | Last Updated on Tue, Aug 14 2018 10:59 AM

గెలుపు గుర్రాలకోసం అన్వేషణ - Sakshi

గెలుపు గుర్రాలకోసం అన్వేషణ

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్
* 2019లో అధికారం మాదే

సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచే సత్తా ఉన్నవారికోసం సర్వే చేస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ వెల్లడించారు. జిల్లాల వారీగా ఇప్పటికే  క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి, నియోజకవర్గాల వారీగా బలమైన నాయకులు.., వారిలో పోరాట పటిమ కలిగినవారిని గుర్తించే ప్రక్రియను ప్రారంభించినట్టుగా చెప్పారు. బుధవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో  ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ ఇప్పుడు రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షపార్టీ బీజేపీయేనన్నారు. 2019లో కచ్చితంగా అధికారంలోకి వచ్చి తీరుతామన్నారు. కేవలం ప్రతిపక్షంగా మిగిలిపోవడానికి బీజేపీ శ్రేణులు సిద్ధంగా లేవని, టీఆర్‌ఎస్ వైఫల్యాలపై పోరాటాలు చేయడానికి పార్టీ కార్యకర్తలు సమరోత్సాహంతో ఉన్నారని చెప్పారు.

బీజేపీ పోరాటాల ఆరంభాన్ని ఆగస్టు రెండోవారం నుంచి చూస్తారని, సెప్టెంబర్ 17 నాటికి బీజేపీ పోరాటం అంటే ఏమిటో టీఆర్‌ఎస్ ప్రభుత్వం రుచి చూ డాల్సి ఉంటుందని లక్ష్మణ్ హెచ్చరించారు. అప్పటి హైదరాబాద్ రాష్ట్రం 1948 సెప్టెంబర్ 17న నిజాం నిరంకుశ ఏలుబడి నుంచి విముక్తిపొంది భారతదేశంలో  విలీనమైందని, ఈ విషయాన్ని అధికారంలోకి వచ్చేదాకా ఇప్పటి సీఎం కేసీఆర్ కూడా చాలాసార్లు చెప్పారని లక్ష్మణ్ గుర్తుచేశారు. ప్రపంచంలోనే స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించని జాతి తెలంగాణ ఒక్కటేనన్నారు. స్వంత రాష్ట్రంలోనూ ఆత్మగౌరవంతో, స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకునే హక్కు లేకుండా పోయిందని లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోకుండా సీఎం కేసీఆర్ ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. ముస్లింల ఓట్లకోసం, ఎంఐఎంతో చీకటిదోస్తీ వల్లనే సెప్టెంబర్ 17నవిమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడంలేదని ఆరోపించారు.
 
ప్రభుత్వమే నిర్వహించాలి..
సెప్టెంబర్ 17న ప్రభుత్వమే అధికారికంగా విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని  పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. దీనిపై ఆగస్టు మొదటివారంలో ఉద్యమ కార్యాచరణ ప్రారంభం అవుతుందని, ఈ ఉద్యమంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పాల్గొంటారని వెల్లడించారు. పార్టీ ఫిరాయింపుల ద్వారా రాష్ట్రంలో జరుగుతున్న అప్రజాస్వామిక చర్యలను జనంలో చర్చకు పెడతామన్నారు. అక్టోబర్‌లో రాష్ట్రానికి ప్రధాని మోదీ రానున్నట్టు చెప్పారు. నెలాఖరులోపు రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి కమిటీలను పూర్తి చేస్తామన్నారు.  

టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఎన్నో వైఫల్యాలు, అవినీతి ఉన్నాయన్నారు. రెండు బెడ్‌రూముల ఇళ్లు, దళితులకు భూపంపిణీ, కేజీ టు పీజీ దాకా ఉచిత విద్య వంటివాటివెన్నో పథకాలను సీఎం కేసీఆర్ అమలుచేయలేదన్నారు. వీటిపై క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామన్నారు. ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నవారికి న్యాయసహాయం అందిస్తామన్న మజ్లిస్ తీరును, మజ్లిస్‌కు టీఆర్‌ఎస్ మద్దతును ప్రజల్లోకి తీసుకుపోతామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement