జాబ్ ఇంటర్వ్యూ.. సక్సెస్‌కు సోపానాలు
ఆసక్తిని వ్యక్తపరచాలి
ఇంటర్వ్యూ చేసే వారి ప్రశ్నలకు తడబడకుండా సమయస్ఫూర్తితో, ముఖంపై చెదరని చిరునవ్వుతో సమాధానాలు చెప్పాలి. ఒకవేళ సమాధానం తెలియకపోతే నిజాయితీగా అవగాహన లేదని చెప్పాలి. అంతేగానీ ఏదోఒకటి చెప్పడానికి ప్రయత్నించకూడదు.అభ్యర్థి ధరించిన దుస్తుల తీరును కూడా బోర్డు పరిశీలిస్తుంది. అందువల్ల వాతావరణానికి సరిపడా దుస్తులు ధరించాలి. ముఖానికి నప్పేలా హెయిర్ స్టైల్‌ను ఉంచుకోవాలి. వ్యక్తిగత అభిరుచులపైనా వచ్చే ప్రశ్నలకు సిద్ధంగా ఉండాలి.
ఇంటర్వ్యూ చేసేవారు ఏదైనా చెబుతున్నప్పుడు మధ్యలో ఆటంకం కలిగించకూడదు. వారు చెప్పే దాన్ని శ్రద్ధగా వినాలి. వారు చెప్పే వాటిపై అభ్యర్థులు తమ ఆసక్తిని ముఖ కవళికల ద్వారా వ్యక్తపరచాలి. ప్రశ్న సరిగా వినిపించకపోతే, మరోసారి రిపీట్ చేయమనిమర్యాదపూర్వకంగా అడగొచ్చు.మాక్ ఇంటర్వ్యూలకు హాజరు కావడం వల్ల ఒక ప్రశ్నకు సమాధానం ఎలా చెబుతున్నాం? బలాలు, బలహీనతలేంటి? వంటి విషయాలను విశ్లేషించుకోవచ్చు. ఒక విషయంపై స్నేహితులు, ఫ్యాకల్టీతో చర్చించడం వల్ల ఇంటర్వ్యూకు అనుగుణంగా మాట్లాడే తీరు అలవడుతుంది.
కాలేజీ క్యాంపస్ నుంచి బయటకు రాకముందే క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో.. కలల కొలువును సొంతం చేసుకోవాలని అందరికీ ఉంటుంది. అదికుదరకుంటే పట్టా చేతపట్టుకొని బయటకు అడుగుపెడుతూనే చక్కటి కొలువుల్లో కుదురుకోవాలని కోరుకుంటారు. అప్పటికే ఉన్న ‘పని అనుభవం’తో ఉన్నత శిఖరాలను అందుకొవాలని ప్రయత్నిస్తారు మరికొందరు.. వీరందరి లక్ష్యం నెరవేరాలన్నా.. కార్పొరేట్ కొలువును సొంతం చేసుకోవాలన్నా.. సబ్జెక్టులో పరిజ్ఞానం ఒక్కటే సరిపోదు. రాత పరీక్షతో పాటు ఇంటర్వ్యూలోనూ ప్రతిభ కనబరచాలి.
ఐటీ, ఫార్మా, మౌలిక వసతులు, ఆటోమొబైల్.. ఇలా వివిధ విభాగాలకు చెందిన సంస్థలు ఎప్పటికప్పుడు తమ అవసరాలకు అనుగుణంగా ఉద్యోగ నియామకాలకు ప్రకటనలు విడుదల చేస్తుంటాయి. రాత పరీక్షతో పాటు ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంటాయి. ప్రస్తుత పోటీ ప్రపంచంలో కోరుకున్న కొలువు దక్కాలంటే.. కీలకమైన ఇంటర్వ్యూలో విజయం సాధించాలి. ఈ దశలో ఏ చిన్న పొరపాటు చేసినా, అది ఉద్యోగాన్ని దూరం చేస్తుంది. అందుకే అభ్యర్థి, సంస్థ ప్రతినిధుల మధ్య జరిగే పరస్పర భావప్రసారాల సమాహారమైన ఇంటర్వ్యూకు శ్రద్ధగా ప్రిపరేషన్ కొనసాగించాలి.
తొలి అడుగు ఆత్మస్థైర్యం:
అభ్యర్థిని ఇంటర్వ్యూ బోర్డు సభ్యులు వివిధ రకాల ప్రశ్నలు అడుగుతుంటారు. ఇలాంటి ప్రశ్నల ద్వారా అభ్యర్థిని కలవరపాటుకు గురిచేయాలన్న ఉద్దేశం బోర్డుకు ఏమాత్రం ఉండదు. అభ్యర్థి నైపుణ్యాన్ని, విషయ పరిజ్ఞానాన్ని తెలుసుకోవాలన్నదే వారి అసలు లక్ష్యమని గుర్తించాలి. అందువల్ల ఇంటర్వ్యూ అంటే అనవసర భయాలు పెట్టుకోకుండా ఆత్మస్థైర్యంతో సన్నద్ధతను కొనసాగించాలి.
ఏ ఎండకు ఆ గొడుగు!
ఉద్యోగ నియామకాలు చేపడుతున్న ఆయా సంస్థలనుబట్టి అభ్యర్థులు ఇంటర్వ్యూకు సన్నద్ధం కావాలి.
{పొడక్ట్ డెవలప్‌మెంట్ సంస్థలు అయితే.. అకడమిక్‌తో పాటు ప్రోగ్రామింగ్ నైపుణ్యాలపై ప్రశ్నలు అడుగుతారు.
ఆర్ అండ్ డీ సంస్థల్లో ఉద్యోగం కోసం సృజనాత్మక దృక్పథం, డాక్యుమెంటేషన్ స్కిల్స్‌పై ప్రశ్నలు వస్తాయి.
కాల్ సెంటర్, బీపీఓ తదితర సర్వీస్ సెక్టార్ సంస్థల్లో ఉద్యోగాల కోసం కమ్యూనికేషన్ స్కిల్స్‌పై దృష్టిసారిస్తారు.
ఇంజనీరింగ్ సేవల సంస్థలు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంపై అభ్యర్థులకున్న అవగాహనను పరీక్షిస్తాయి.
కోర్సు పూర్తయ్యాక అందుబాటులో ఉన్న సమయంలో ఏయే కోర్సులు చేశారు? ప్రస్తుతం వాటి ఉపయోగం ఏమిటి? వాటిని సంస్థ అవసరాల కోసం ఏ విధంగా అన్వయించగలరు? తదితర అంశాలకు సంబంధించిన ప్రశ్నలు వచ్చే అవకాశముంది. అందువల్ల అభ్యర్థులు ఈ దిశగా సిద్ధంగా ఉండాలి.
ఇష్టమైన సబ్జెక్టు ఏమిటి?
ఇంటర్వ్యూల్లో మీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏది? ఎందుకు? అనే ప్రశ్న సాధారణంగా ఎదురవుతుంటుంది. ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చేలా విద్యార్థులు సన్నద్ధం కావాలి. ఏదో ఆ సమయానికి స్ఫురించింది చెప్పడం సరికాదు. తమ కోర్సుకు సంబంధించిన సబ్జెక్టుల్లో తమకు బాగా నచ్చిన వాటిపై అన్ని కోణాల్లో పట్టు సాధించాలి. అప్పుడు ఎలాంటి ప్రశ్నలు ఎదురైనా ఇట్టే సమాధానం ఇవ్వగలిగే నైపుణ్యం అలవడుతుంది. ఉదాహరణకు ఇంజనీరింగ్ విద్యార్థులు అకడమిక్ పరంగా కనీసం నాలుగు కోర్ సబ్జెక్టుల్లో, కనీసం రెండు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లపై(ఉదా: సి++, జావా) అవగాహన పెంపొందించుకోవాలి.
రెజ్యూమె, కరిక్యులం విటే:
ఉద్యోగావకాశాలు కల్పించే సంస్థలకు అభ్యర్థులు తమ అర్హతలను, నైపుణ్యాలను వ్యక్తీకరించడానికి రెజ్యూమె, కరిక్యులం విటేలు మార్గాలు. ఫ్రెషర్స్‌కు రెజ్యూమె సరిపోతుంది. అదే పని అనుభవం(వర్క్ ఎక్స్‌పీరియన్స్)తో వేరే సంస్థలో చేరేందుకు కరిక్యులం విటే(సీవీ) అవసరమవుతుంది. ఇంటర్వ్యూ బోర్డు తప్పనిసరిగా రెజ్యూమె, సీవీలోని అంశాలపై ప్రశ్నలు అడుగుతుంది. అకడెమిక్, నాన్ అకడెమిక్, ప్రాజెక్టువర్కు ఇలా వివిధ అంశాలపై ప్రశ్నలు వస్తాయి. కొందరు తమ స్నేహితుల రెజ్యూమె/సీవీలను కాపీ కొడుతుంటారు. అది సరికాదు.
సంస్థ వివరాలపై అవగాహన:
అభ్యర్థికి ఉద్యోగంపై ఉన్న ఆసక్తి.. అతనికి లేదా ఆమెకు ఉద్యోగమిస్తే అంకితభావంతో, సమర్థంగా పనిచేయగలరా? అనేదాన్ని ఇంటర్వ్యూ బోర్డు నిశితంగా పరిశీలిస్తుంది. అందువల్ల అభ్యర్థులు ఇంటర్వ్యూకు వెళ్లేముందు ఆయా సంస్థల వివరాలు, అందులో తాను నిర్వహించబోయే విధులు తదితరాల గురించి సమాచారం సేకరించాలి. వీలైతే ఇంటర్వ్యూ బోర్డు సభ్యుల నేపథ్యం గురించి లింక్‌డిన్(ఔజీజ్ఛుఛీజీ) వంటి మార్గాల ద్వారా తెలుసుకోవాలి. ఈ ఉద్యోగం మీరు చేయగలరా? ఈ ఉద్యోగంలో మీరు ఎంతకాలం ఉంటారు? ఈ ఉద్యోగానికి మీరు సరిపోతారని భావిస్తున్నారా? వంటి ప్రశ్నలు ఎదురవుతుంటాయి. ఇలాంటి ప్రశ్నలకు ముందే జవాబులను సిద్ధం చేసుకోవాలి.
కమ్యూనికేషన్ నైపుణ్యాలు:
గ్లోబలైజేషన్ కారణంగా దేశాల మధ్య సరిహద్దులు చెరిగిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో అభ్యర్థులు తప్పనిసరిగా ఇంగ్లిష్ కమ్యూనికేషన్ నైపుణ్యాలను అలవర్చుకోవాల్సిన అవసరం వచ్చింది. ఓ అభ్యర్థికి ఎంత పే ప్యాకేజీ ఇవ్వాలి? ఎలాంటి బాధ్యతలు అప్పగించాలి? వంటివి అతడు/ఆమె కమ్యూనికేషన్ స్కిల్స్‌పైనే ఆధారపడి ఉంటున్నాయంటే అతిశయోక్తి కాదు. ఇంటర్వ్యూలో కమ్యూనికేషన్ స్కిల్స్, నాయకత్వ లక్షణాలు వంటి సాఫ్ట్‌స్కిల్స్‌ను పరీక్షించేలా ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థులు ఈ దిశగా సిద్ధంగా ఉండాలి.
ఇంటర్వ్యూలో సాధారణంగా అడిగే కొన్ని ప్రశ్నలు:
మీ గురించి చెప్పండి?
ఈ కెరీర్‌నే ఎంపిక చేసుకోవడానికి కారణం?
ఈ ఉద్యోగానికి మేం నిన్నే ఎందుకు ఎంపిక చేయాలి?
ఇటీవల కాలంలో మీరు సాధించిన లక్ష్యాలేవి?
మీ బలం, మీ బలహీనతలు ఏమిటి?
మా సంస్థ గురించి మీకేమి తెలుసు?
మా కంపెనీలోనే ఎందుకు పనిచేయాలనుకుంటున్నారు?
ఇంటర్వ్యూలో సాధారణంగా పరీక్షించేవి:
టెక్నికల్ స్కిల్స్, సబ్జెక్టు పరిజ్ఞానం.
కమ్యూనికేషన్ స్కిల్స్(వెర్బల్, నాన్‌వెర్బల్).
లీడర్‌షిప్ స్కిల్స్.
సమస్యపై స్పందించి, వేగంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం.
ఆలోచన, అవగాహన, విశ్లేషణా సామర్థ్యం; నిజాయితీ.