చక్కెర ధరలు పెంచితే కఠిన చర్యలు
పౌర సరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా చక్కెర నిల్వ చేసి, కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామని పౌర సరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ చక్కెర వ్యాపారులను హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు చక్కెర ధరల నియంత్ర ణకుగాను ఆయన రాష్ట్రంలోని హోల్‌సేల్ చక్కెర వ్యాపా రుల సంఘం ప్రతినిధులతో బుధవారం సమావేశం నిర్వహించారు. చక్కెర నిల్వలు, లావాదేవీలపై పరిమితులు విధిస్తూ కేంద్రం గతంలో విడుదల చేసిన ఉత్తర్వులను మరో 6 నెలల (ఈ ఏడాది అక్టోబర్ 28) వరకు పొడిగించింది.
లైసెన్స్ పొందిన వ్యాపారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన ధర కన్నా ఎక్కువకు చక్కెర అమ్మకూడదని కమిషనర్ అన్నారు. 5 క్వింటాళ్ల కంటే ఎక్కువ చక్కెర నిల్వ చేసే వ్యాపారినే డీలర్‌గా పరిగణిస్తామని, వారు సంబంధిత జిల్లా పౌరసరఫరాల అధికారి, తహసీల్దార్ దగ్గర హోల్‌సేల్, రిటైల్ లైసెన్స్ తీసుకోవా లని, లేనిపక్షంలో వారిపై నిత్యావసరాల చట్టం కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చక్కెర నిల్వలపైనా కమిషనర్ పరిమితి విధించారు.