హైదరాబాద్ : హైదరాబాద్ నగర ప్రతిష్టను జాతీయ స్థాయికి తీసుకెళ్లి అగ్రగామిగా నిలపాలని పురపాలక, ఐటీ, పరిశ్రమల మంత్రి కె.తారకరామారావు అన్నారు. ప్రజల భాగస్వామ్యం లేని దే స్వచ్ఛ హైదరాబాద్ సాధ్యం కాదన్నారు. సోమవారం బాగ్‌లింగంపల్లిలోని అంబేడ్కర్ కళాశాలలో జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు, రాంనగర్ డివిజన్ కార్పొరేటర్ వి. శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో స్వచ్ఛ్ సర్వేక్షణ్ కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సులో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు కేటీఆర్, నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొని ప్రసంగించారు. అంతకుముందు వీఎస్టీ చౌరస్తా నుంచి సుందరయ్య పార్కు వరకు 15,320 మంది రాంనగర్ డివిజన్ ప్రజలు భారీ స్థాయిలో స్వచ్ఛ్ సర్వేక్షణ్‌లో పాల్గొని గిన్నిస్ వరల్డ్ రికార్డు, యూనివర్సల్ బుక్ ఆఫ్ రికార్డులను సాధించారు.
స్వచ్ఛ భారత్‌కు ముందే స్వచ్ఛ హైదరాబాద్
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ ప్రధాని మోదీ స్వచ్ఛ భారత్ ప్రారంభం చేయకముందే ముఖ్యమంత్రి కేసీఆర్ స్వచ్ఛ హైదరాబాద్‌ను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. నగరంలో గతంలో 3,500 మెట్రిక్ టన్నుల చెత్తను ఉత్పత్తి చేస్తే నేడు అంతకంటే ఎక్కువగా 4,500 మెట్రిక్ టన్నుల చెత్తను ఉత్పత్తి చేస్తున్నామని తెలిపారు. నగరంలో 20 వేల మంది పారిశుధ్య సిబ్బంది ఉన్నా హైదరాబాద్‌లో ఉన్న కోటి జనాభాకు వారు సరిపోరన్నారు.
44 లక్షల చెత్త బుట్టలు పంపిణీ చేశామని అయితే నగరంలో ఏ ఒక్కరూ ఈ బుట్టలను ఉపయోగించడం లేదన్నారు. ‘‘ఈ నగరం బాగుంటేనే నేను, నా భవిష్యత్ బాగుంటుందని’’పిల్లలే తల్లిదండ్రులకు చెప్పాలన్నారు. 2018 స్వచ్ఛ్ సర్వేక్షణ్ సర్వేలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం సభలో పాల్గొన్న ప్రజలతో తడి పొడి చెత్తను తప్పకుండా వేరు చేస్తామని, బహిరంగ ప్రదేశాల్లో మల, మూత్ర విసర్జన చేయమని తదితర సూత్రాలతో కూడిన పత్రాన్ని చదివి ప్రతిజ్ఞ చేయించారు.
హోం మంత్రి నాయిని మాట్లాడుతూ నగర బంగారు భవిష్యత్‌లో విద్యార్థులు భాగస్వాములు కావడం శుభపరిణామమని అన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు జి.వివేక్, మాజీ మంత్రి జి.వినోద్, టీఆర్‌ఎస్ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ముఠా గోపాల్, కార్పొరేటర్ ముఠా పద్మానరేశ్, గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రతినిధి లక్ష్మీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment