'మ్యాన్ హోల్' బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
హైదరాబాద్: మ్యాన్ హోల్ ఘటనకు బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. మృతుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. డ్రైనేజీ నిర్వహణను యంత్రీకరణ ద్వారా నిర్వహించాలని భట్టి విక్రమార్క తెలిపారు.
కాగా, మృత్యు కుహరాల్లా మారిన మ్యాన్‌హోల్‌లు నలుగురిని మింగేశాయి. జలమండలి అధికారులు, పనులు చేపట్టిన కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం నిండు ప్రాణాలను బలి తీసుకున్నాయి. రెక్కాడితేగాని డొక్కాడని ముగ్గురు కార్మికులతోపాటు వారిని కాపాడబోయిన మరో వ్యక్తి మృత్యువాత పడ్డారు. మాదాపూర్‌లో ఈ దుర్ఘటన జరిగింది. మాదాపూర్‌లో శనివారం ఈ దుర్ఘటన జరిగిన సంగతి తెలిసిందే.