ఆయనేదో పొడిచేసినట్టు!
జీవన్‌రెడ్డిని ఏకవచనంతో సంబోధించిన తలసాని
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిని ఉద్దేశించి మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ చేసిన వ్యాఖ్యలు సభలో కొద్దిసేపు గందరగోళాన్ని సృష్టించాయి. ఏకవచన సంబోధనతో తలసాని మాట్లాడ్డాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఖండించారు. కరువుపై చర్చ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతున్నప్పుడు మంత్రి ఏదో అనటంతో.. ‘కరువు కష్టాలు మాకు తెలుసు సిటీలో ఉండే తలసానికి ఏం తెలుసు’ అని జీవన్‌రెడ్డి అన్నారు. దీంతో కలుగజేసుకున్న శ్రీనివాసయాదవ్ ‘ప్రపంచంలో ఈయనొక్కడే మేధావి అయినట్టు, ఆయనొక్కడే వ్యవసాయం చేస్తున్నట్టు, ఊళ్లన్నీ ఈయనే తిరుగుతున్నట్టు, ఆయనేదో పొడిచేసినట్టు, మేమేదో పొడవకుండా ఉన్నట్టు.. ఏం విమర్శలు’ అంటూ అడ్డుకున్నారు.
దీంతో కాస్త అసహనానికి గురైన జీవన్‌రెడ్డి.. ‘నేను చెప్పేవన్నీ నిజాలు, రాజకీయాలు చేయాలంటే బాగా చేస్తాం.. 1981లోనే సమితి అధ్యక్షుడిగా ఉన్నా..’ అని అన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడినప్పుడు శ్రీనివాసయాదవ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘జీవన్‌రెడ్డి సీనియర్ సభ్యుడు, ఆయనను ముఖ్యమంత్రి కూడా గౌరవిస్తారు. ఏకవచన సంబోధనతో ఆయనను నువ్వుగివ్వు అనడం, పొడిచేస్తాడా అనటం మంచి పద్ధతి కాదు. మోండా మార్కెట్ నుంచి వచ్చిన శ్రీనివాసయాదవ్ అలా మాట్లాడొద్దు, కనీసం జీవన్‌రెడ్డి వయసుకైనా గౌరవం ఇవ్వాలి కదా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.