తెలంగాణను అడ్డుకున్నవారే పక్కనున్నారు
కేసీఆర్‌పై సీపీఎం కార్యదర్శి తమ్మినేని ధ్వజం...
సాక్షి, హైదరాబాద్: గతంలో తెలంగాణను అడ్డుకున్నవారే ఇప్పుడు సీఎం కేసీఆర్‌కు కుడి, ఎడమలుగా ఉన్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వ్యాఖ్యానించారు. ఆనాడు గట్టిగా వ్యతిరేకించిన తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌లను కే సీఆర్ కే బినెట్‌లోకి తీసుకుని అందలం ఎక్కించారన్నారు. సోమవారం నుంచి తమ పార్టీ మొదలుపెట్టనున్న మహాజన పాదయాత్రకు ఆదిలోనే ఆటంకాలు సృష్టించేందుకు ప్రయత్నాలు జరగడాన్ని ఆయన ఖండించారు. సీపీఎం తెలంగాణను కక్షపూరితంగా అడ్డుకునే ప్రయత్నం చేసింది కాబట్టి ఆ పార్టీ నేతల పాదయాత్రను అడ్డుకోవాలంటూ స్వయంగా కేసీఆర్ పిలుపునిచ్చారన్నారు.
శనివారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో విద్యావేత్తలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 37 సీట్లలో తమ పార్టీ పోటీ చేసిందని, మిగిలిన సీట్లలో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలకు వ్యతిరేకంగా టీఆర్‌ఎస్‌కే తాము మద్దతునిచ్చామన్నారు. సీపీఎం నిజాయితీ, క్రమశిక్షణ ఉన్న పార్టీ అని తర్వాత కేసీఆర్ కితాబు కూడా ఇచ్చారని తమ్మినేని గుర్తు చేశారు. పార్టీ నాయకుడు జి.రాములు, ప్రొఫెసర్లు కంచ ఐలయ్య, పీఎల్ విశ్వేశ్వరరావు, సింహాద్రి, గాలి వినోద్‌కుమార్ తదిత రులు సమావేశంలో పాల్గొన్నారు.