తనిష్క్ జ్యువెలర్స్‌కు ‘కన్నం’ | Tanishq Jewellers 'hole' | Sakshi
Sakshi News home page

తనిష్క్ జ్యువెలర్స్‌కు ‘కన్నం’

Published Sun, Jan 26 2014 4:05 AM | Last Updated on Tue, Aug 21 2018 5:44 PM

తనిష్క్ జ్యువెలర్స్‌కు ‘కన్నం’ - Sakshi

తనిష్క్ జ్యువెలర్స్‌కు ‘కన్నం’

  • నగరం నడిబొడ్డున..
  •  పంజగుట్టలో తనిష్క్ జ్యువెలర్స్‌కు ‘కన్నం’  
  •  లోపల గంటకుపైగా తీరిగ్గా గడిపిన వైనం  
  •  పక్కా ప్రొఫెషనల్స్ పనేనా?  
  •  9 కౌంటర్ల నుంచి  రూ.23 కోట్ల విలువైన 30 కేజీల పసిడి తస్కరణ  
  •  సెక్యూరిటీ గార్డుల నిర్లక్ష్యం
  •  
    సాక్షి, సిటీబ్యూరో: నగరం నడిబొడ్డున, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి కూతవేటు దూరంలో భారీ చోరీ జరిగింది. పంజగుట్టలోని తనిష్క్ జ్యువెలర్స్ వెనుక వైపు గోడకు రంధ్రం చేసి ప్రవేశించిన చోరుడు రూ.23 కోట్ల విలువైన 30 కేజీల బంగారం, విలువైన రాళ్లు పొదిగిన నగల్ని మూటగట్టుకుపోయాడు. పక్కా ప్రొఫెషనల్ నేరగాళ్ల పనిగా అనుమానిస్తున్న పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కేసును నగర పోలీసు కమిషనర్ అనురాగ్‌శర్మ నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్)కు బదిలీ చేశారు. సీసీ కెమెరా ఫుటేజ్‌ను బట్టి.. దొంగ మొదట స్విచ్ బోర్డు వద్దకు వెళ్లి లైట్లన్నీ ఆర్పాడు. దీన్నిబట్టి అంతకుముందు దుకాణం లోపలి నుంచి కూడా రెక్కీచేశాడా? లేదా తెలిసిన వారు సహకరించారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.
     
    ప్రధాన రహదారిపైనే దుకాణం
     
    పంజగుట్ట కూడలి నుంచి సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లే మార్గంలో ఫ్లైఓవర్ ముగింపు దగ్గర తేజస్విని ప్లాజా ఉంది. ఇందులో టాటా ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన తనిష్క్ జ్యువెలరీ దుకాణం నిర్వహిస్తున్నారు. ఇది సెల్లార్+జీ+టూ భవనం కాగా... సెల్లార్‌లో పార్కింగ్, కింది అంతస్తులో బంగారు నగలు, మొదటి అంతస్తులో వజ్రాభరణాల విక్రయ విభాగాలు, రెండో అంతస్తులో సంస్థ పాలనా కార్యాలయం ఉన్నాయి. కింది అంతస్తులోనే ప్రధాన ద్వారం ఉంది. శుక్రవారం రాత్రి తొమ్మిది గంటలకు షాపు మూసివేశారు. శనివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో సంస్థ జనరల్ మేనేజర్ మణికందన్ వచ్చి దుకాణం తెరిచి లోపలకు వెళ్లారు. నగల విక్రయ విభాగంలోని 9 కౌంటర్లలో ఆభరణాలు కనిపించలేదు. వెంటనే పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
     
    ఎక్కడా ఆధారాలు దొరక్కుండా..
     
    రంధ్రం పరిమాణంతో పాటు ఇతర ఆధారాలను బట్టి పోలీసులు 25-30 ఏళ్ల మధ్య వయస్కుడైన బక్కపలుచని వ్యక్తి లోపలకు వచ్చినట్లు నిర్ధారించారు. రాత్రి 2 గంటల ప్రాంతంలో చొరబడిన దుండగుడు గంటా పదిహేను నిమిషాల పాటు తచ్చాడుతూ, తీరిగ్గా చోరీ చేసినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయింది. దుండగుడు ఎడమకాలు కుంటుతున్నట్లు గుర్తించారు. ముఖకవళికలు తెలియకుండా మాస్క్, వేలిముద్రలు పడకుండా చేతులకు గ్లౌజులు, పాదముద్రలు చిక్కకుండా కాళ్లకు పాలథిన్ కవర్లు ధరించాడు. రంధ్రంలోంచి లోపలకు వస్తున్నప్పుడు దెబ్బలు తగలకుండా పాదాల పై భాగంలో గోనెసంచులు కట్టుకున్నాడు. లోపల మొత్తం 15 కౌంటర్లు, డిస్‌ప్లేలు ఉండగా, తొమ్మిది కౌంటర్లలోని బంగారాన్ని ఖాళీ చేశాడు. డిస్‌ప్లేల జోలికి పోలేదు.

    పోలీసు జాగిలాలకూ ఆధారం దొరక్కుండా.. వెంట కారం తీసుకెళ్లి, అవి వాసన పీల్చే అవకాశం లేకుండా పలుచోట్ల చల్లాడు. పై అంతస్తులో వజ్రాభరణాలున్నాయని, దుండగుడు అక్కడికీ వెళ్లి ఉంటే చోరీ సొత్తు విలువ భారీగా ఉండేదని పోలీసులు చెప్పారు. దాదాపు 30 కేజీల సొత్తు తస్కరణకు గురైంది. చోరీ తీరును అధ్యయనం చేసిన పోలీసులు.. బయట మరో ఇద్దరైనా కాపు కాసి ఉంటారని అనుమానిస్తున్నారు. రంధ్రం నుంచి ముందు చేతులు పెట్టిన దొంగ ఆ తరవాత తలపెట్టి లోపలకు రావడం సీసీ కెమెరాల్లో నమోదైంది. పోలీసు జాగిలం దుకాణం లోపలకెళ్లి చోరీ జరిగిన భవనం వెనక వైపు తిరిగి అక్కడి నుంచి పక్కనే ఉన్న టోపాజ్ భవనం పక్క సందులోకి వెళ్లింది.
     
     ‘పాత కిటికీ’ని పగులగొట్టి లోపలకు..
     తేజస్విని ప్లాజాకు వెనుక వైపు ఓ కమర్షియల్/రెసిడెన్షియల్ కాంప్లెక్స్ ఉంది. దీని ప్రహరీగోడకు, తేజస్విని ప్లాజా గోడకు మధ్య రెండడుగుల ఖాళీ సందు ఉంది. కాంప్లెక్స్ ప్లాజా కంటే ఎత్తులో ఉండటంతో, దాని గ్రౌండ్ ఫ్లోర్ దీని ఫస్ట్‌ఫ్లోర్‌కు సమాన ఎత్తులో ఉంది. కాగా, జ్యువెలర్స్ నిర్వాహకులు.. భద్రత నిమిత్తం భవనం గోడలకు ఎవరూ రంధ్రం వేయడం సాధ్యం కాకుండా లోపల ఇనుప మెష్‌లు ఏర్పాటు చేశారు. అయితే కింది అంతస్తులోని బంగారం విభాగంలో మూడో పిల్లర్ పక్కన గతంలో కిటికీ ఉండేది. కొన్నేళ్ల క్రితం దీన్ని మూసేయడంతో అక్కడ ఇనుప మెష్ ఏర్పాటుకు ఆస్కారం లేకపోయింది. భవనం ఎడమ వైపు కాంప్లెక్స్‌కు దారితీసే మార్గం నుంచి సందు వరకు చేరుకున్న దుండగుడు.. బయటి వైపు నుంచి పాత కిటికీ ఉన్న ప్రాంతాన్ని గుర్తించి అక్కడే రంధ్రం చేసి లోపలకు చొరబడ్డాడు.
     
     పాత నేరగాళ్ల పనిగా అనుమానం..
     తనిష్క్ జీఎం మణికందన్ ఇచ్చిన ఫిర్యాదులో ప్లెయిన్, గోల్డ్ ఆర్నమెంట్స్ 18 కిలోలు (విలువ సుమారు రూ.11కోట్లు), కలర్ స్టోన్స్, ముత్యాలు పొదిగిన ఆభరణాలు 12 కిలోలు (విలువ రూ.12 కోట్లు) చోరీ అయినట్టు పేర్కొన్నారు. ప్రాథమిక ఆధారాలను బట్టి ఇది పాత నేరగాళ్ల పనిగా అనుమానిస్తున్న అధికారులు నగరం, ఇతర రాష్ట్రాల ముఠాల వివరాలు సేకరిస్తున్నారు. సీసీ కెమెరా ఫుటేజ్‌లో దొంగ కుంటుతున్నట్లు ఉంది. నిజంగానే అంగవికలుడా? లేక పోలీసుల దృష్టి మరల్చడానికి అలా చేశాడా? అనేది పరిశీలిస్తున్నారు. సీసీఎస్ అధికారులు 8 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. నగరంలోని లాడ్జిలు, హోటళ్లు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో దర్యాప్తు చేయడంతో పాటు ఇవి ఇతర ప్రాంతాలకు వెళ్లాయి. పంజగుట్ట ప్రాంతంలోని ట్రాఫిక్ కెమెరాలు, పబ్లిక్ ప్లేసులు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, శివార్లలోని టోల్‌గేట్ల వద్ద ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. సంస్థకు చెందిన వారు చోరులకు సహకరించారా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని నగర పోలీసు కమిషనర్ అనురాగ్‌శర్మ, డీసీపీ సత్యనారాయణ, అదనపు డీసీపీ నాగరాజు, ఏసీపీ వెంకటనర్సయ్య, సీఐ తిరుపతిరావు, డీఐ సత్తయ్య పరిశీలించారు. అనురాగ్ శర్మ మాట్లాడుతూ... సీసీ కెమెరాల్లోని ఫీడ్ ఆధారంగా నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామన్నారు.
     
     నిర్లక్ష్యం ఖరీదు!
     ఘటనలో సెక్యూరిటీ గార్డుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ సమయంలో పూర్తిగా నిద్రపోయి ఉంటారని భావిస్తున్నారు
         
     జ్యువెలర్స్‌ను రాత్రి మూసివేసేట ప్పుడు నగలు, బంగారాన్ని కౌంట ర్లు, డిస్‌ప్లేల్లోంచి తీసి కట్టుదిట్టమైన చెస్ట్‌ల్లో భద్రపరుస్తారు. తనిష్క్ నిర్వాహకులు ఆ పని చేయలేదు
         
     రూ.కోట్ల విలువైన సరుకు ఉండే, లావాదేవీలు చేసే ఈ దుకాణం బయట, వెనుక సీసీ కెమెరాల్లేవు
         
     పక్కా రెక్కీ చేశాకే చోరీ చేసినట్లు స్పష్టమవుతోంది. ఘటనకు రెండ్రోజుల ముందు దుకాణానికి కస్టమర్‌లా వచ్చి వెళ్లిన ఓ అనుమానితుడిని సీసీ కెమెరాల్లో పోలీసులు గుర్తించారు. ఒకరోజు ముందు ఓ అనుమానితుడు దుకాణం వద్ద తచ్చాడాడని స్థానికులు చెబుతున్నారు
         
     శుక్రవారం రాత్రి ఇద్దరు సెక్యూరిటీ గార్డులు విధుల్లో ఉన్నారు. దుకాణం వెనుక వైపు సందులో గడ్డపారలు, ఇతర వస్తువులతో రంధ్రం చేయడం సాధ్యం కాదు. దీన్నిబట్టి దుండగులు డ్రిల్లింగ్ మిషన్ వాడినట్లు పోలీసులు తేల్చారు. ఈ శబ్దాన్ని సెక్యూరిటీ గార్డులు వినలేదు
         
     తొమ్మిది అంగుళాల మందం గల గోడకు 1.5 అడుగుల ఎత్తు, అడుగు వెడల్పుతో రంధ్రం చేశాడు. అంతసేపూ గార్డులు పసిగట్టలేదు
         
     ఒక్కో కౌంటర్‌లోనూ చోరీ తరవాత దొంగ ఆ సొత్తును బయట ఉన్న మరో వ్యక్తికి రంధ్రం ద్వారా అందిస్తున్నట్లు కెమెరాల్లో అస్పష్టంగా కనిపిస్తోంది. ఈ వ్యవహారమూ సెక్యూరిటీ గార్డులకు తెలియలేదు
         
     ఉదయం సంస్థకు వచ్చిన మణికందన్ లోపలకు వెళ్లి గుర్తించే వరకు చోరీ అంశం సెక్యూరిటీ గార్డులకు తెలియలేదు. దొంగలు దుకాణం ముందు కారం చల్లినా గార్డులు గుర్తించలేదు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement