‘దేశం’ ఉనికి ప్రశ్నార్థకమే..!
జిల్లాలో అదృశ్యమవుతున్న టీడీపీ
నేడు ఆవిర్భావ దినోత్సవం
సిటీబ్యూరో: పార్టీ ఆవిర్భావించాక గడచిన మూడు దశాబ్దాల కాలంలో ఎన్నడూలేని రీతిలో నగరంలో టీడీపీ కోలుకోలేని దెబ్బతిన్నది. దాదాపుగా పార్టీ అవసాన దశకు చేరుకుంది. ఈ నగరంలోనే పురుడుపోసుకున్న పార్టీ.. సుదీర్ఘ పయనంలో ఎన్నో ఉత్తానపతనాల్ని చవి చూసినప్పటికీ..ఇంత దారుణంగా దెబ్బతినడం ఇప్పుడే. పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేళ.. పార్టీ జిల్లాశాఖకు అధ్యక్షుడు కానీ.. కన్వీనర్ కానీ లేని దయనీయ స్థితి. అంతేకాదు.. ఒకరిద్దరు జిల్లా స్థాయి నాయకులు తప్ప ఎవరూ మిగలని దుస్థితి. పార్టీకి ఇంతటి అవమానం.. పతనం గతంలో లేవు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సైతం గ్రేటర్ పరిధిలోని 24 అసెంబ్లీ స్థానాలకు గాను 15 స్థానాలను గెలుచుకున్న పార్టీకి వారిలో ఒక్కరు తప్ప మిగతా వారెవరూ మిగల్లేదు. పార్టీ టికెట్‌పై గెలిచినప్పటికీ.. 14 మంది పార్టీని వీడి వెళ్లిపోయారు. ఎల్‌బీనగర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్.కృష్ణయ్య తప్ప ప్రస్తుతం ఇంకెవరూ లేరు. ఇది ఎమ్మెల్యేల పరిస్థితి కాగా.. పార్టీ జిల్లాశాఖకు అధ్యక్షులుగా పనిచేసినవారు సైతం పార్టీలో లేకుండా పోవడం పార్టీ పరిస్థితికి దర్పణం. జిల్లా పార్టీకి అధ్యక్షులుగా వ్యవహరించిన తీగల కృష్ణారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, కృష్ణయాదవ్‌లతోపాటు ముఠాగోపాల్, జి.సాయన్న వంటివారు సైతం టీడీపీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరారు.
జిల్లా అధ్యక్షునిగా వ్యవహరించిన సీబీఐ మాజీ డెరైక్టర్ కె. విజయరామారావు సైతం పార్టీకి దూరమయ్యారు. ఆఖరుకు కృష్ణయాదవ్ పార్టీని వీడి పోవడానికి కారకుడైన మాగంటి గోపీనాథ్ సైతం టీఆర్‌ఎస్ పంచన చేరడం టీడీపీ పతనానికి నిలువెత్తు నిదర్శనం. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ఉన్న మాగంటికి జిల్లా పగ్గాలు కూడా అప్పగించినందునే కృష్ణయాదవ్ టీడీపీకి గుడ్‌బై చెప్పారు. పార్టీ పూర్తిగా వ్యాపారమయమైందని, బడుగులకు, కష్టసమయంలో ఆదుకున్నవారికి గుర్తింపులేదని కృష్ణయాదవ్ వెళ్లిపోగా.. ఆయన వెళ్లిన కొద్దిరోజులకే మాగంటి సైతం టీడీపీకి టాటా చెప్పడం విచిత్రం. టీడీపీ అధ్యక్షులుగా వ్యవహరించిన తలసాని, కృష్ణారెడ్డి, సాయన్న ఎమ్మెల్యేలుగా గెలిచాక టీఆర్‌ఎస్‌కు వెళ్లిపోయారు. వీరిలో అందరికంటే ముందు టీఆర్‌ఎస్‌లోకి వె ళ్లిన ముఠాగోపాల్ టీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసినప్పటికీ, ఎమ్మెల్యే కాలేకపోయారు. ఇక కార్పొరేషన్ విషయానికి వస్తే 2002లో మేయర్‌కు జరిగిన ప్రత్యక్ష ఎన్నికల్లో ఎంఐంను ఢీకొని మేయర్ పదవిని కైవసం చేసుకున్న పార్టీకి ఇటీవలి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఒకే ఒక సీటు దక్కింది. గత పాలకమండలిలో అధికార కాంగ్రెస్ తర్వాత అత్యధిక స్థానాల్లో 45 డివిజన్లలో గెలిచిన టీడీపీ..ప్రస్తుత పాలకమండలిలో నామ్‌కేవాస్తేగా మారింది.